సీఎం బర్త్‌డే వేడుకలు రద్దు

16 Aug, 2018 14:04 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో, కేంద్ర మంత్రులతో పాటు  పలువురు అగ్రనేతలు ఒక్కొక్కరిగా ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బుధవారం సాయంత్రానికే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా, గురువారం ఉదయానికి అత్యంత విషమంగా మారింది. వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘పార్టీ వాలంటీర్లకు, శ్రేయోభిలాషులకు ఇదే నా విన్నపం. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించడంతో, మీరు నా పుట్టినరోజు వేడుకలు చేయొద్దని కోరుతున్నా. సీఎం అధికారిక నివాసం వద్దకు కూడా వాలంటీర్లు రావొద్దు’  అని అభ్యర్థించారు. 

నేడు కేజ్రీవాల్‌ పుట్టిన రోజు. ఆయన బర్త్‌డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా అరవింద్‌ కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి, కేజ్రీవాల్‌కు అంత మంచి సంబంధాలు లేనప్పటికీ, ఉదయమే మోదీ, కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేయడం, ఆ అనంతరం కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. మిగతా పార్టీల నేతలు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాలు కూడా కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఐఐటీ-ఖరగ్‌పూర్‌ గ్రాడ్యుయేట్‌ అయిన కేజ్రీవాల్‌,  1995లో ఐఆర్‌ఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. కానీ 2012 తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆమ్‌ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్నారు. మరోవైపు వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో, కేజ్రీవాల్‌ కూడా ఉదయం ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. బీజేపీ కూడా నేడు జరుగబోయే తన కార్యక్రమాలన్నింటిన్నీ రద్దు చేసింది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా