ధర్నాలతో అలిసి ప్రకృతి చికిత్సకు..

21 Jun, 2018 11:53 IST|Sakshi
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకృతి చికిత్స కోసం గురువారం బెంగళూర్‌ వెళుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌ పదిరోజుల పాటు బెంగళూర్‌లో గడుపనున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జనరల్‌ కార్యాలయంలో వారం రోజులకు పైగా ధర్నా చేపట్టిన కేజ్రీవాల్‌ రెండు రోజుల కిందటే ఆందోళనను విరమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్‌ అధికారులు తిరిగి విధులకు హాజరవుతుండటంతో కేజ్రీవాల్‌ ధర్నా విరమించారని ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తెలిపారు.

కొద్దిరోజుల కిందటే కేజ్రీవాల్‌ బెంగళూర్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాల్సి ఉందని అయితే ఐఏఎస్‌ల సమ్మె తదనంతర పరిణామాల నేపథ్యంలో వాయిదా పడిందని చెప్పారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి అనంతరం పాలక ఆప్‌తో బ్యూరోక్రాట్లు ఆగ్రహంతో ఉన్నారు. ఐఏఎస్‌ల సమ్మెను నివారించాలని, ఢిల్లీపై కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తూ ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్‌ సహా ఆయన మంత్రివర్గ సహచరులు ధర్నా చేపట్టారు.

మరిన్ని వార్తలు