ఢిల్లీలో ఉచిత వైఫై సేవలు ప్రారంభం

20 Dec, 2019 08:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం నగరంలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న దృష్ట్యా నగరంలో పలుచోట్ల ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన రోజునే కేజ్రీవాల్‌ ఉచిత వైఫైని ప్రారంభించడం యాదృచ్చికం. ఆయన కూడా ఈ విషయాన్నే చెబుతూ జరుగుతోంది పరస్పర విరుద్ధంగా ఉందన్నారు. 70 శాతం మంది ప్రజలు తమ వద్ద పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలు లేకపోవడం వల్ల భయపడుతున్నారని కేజ్రీవాల్‌ అన్నారు.

పౌరసత్వ చట్టాన్ని సవరించవలసిన అవసరం లేదని దానికి బదులు కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అందించడంపై దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం నగరాన్ని కవర్‌ చేయడం కోసం 11,000 వైఫై హాట్‌స్పాట్లను ఉపయోగించాలనుకుంటున్నట్ల చెప్పారు. గురువారం ఆయన ట్వీట్‌ చేస్తూ ఢిల్లీని ఆధునిక ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దిడంలో వైఫై ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. వైఫై ద్వారా తాను, ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా విడియో కాల్‌లో మాట్లాడుకున్నట్లు ఆయన తెలిపారు. (‘పౌర’ సెగలు; ఆందోళనలు.. అరెస్ట్‌లు)

మరిన్ని వార్తలు