ఢిల్లీలో లక్షదాటిన కరోనా కేసులు: కేజ్రీవాల్‌

6 Jul, 2020 14:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ల సంఖ్య లక్ష దాటినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. ఢిల్లీలో కోవిడ్ -19 కేసులు లక్ష దాటాయి. కానీ ఇందులో 72,000 మంది ప్రజలు కోలుకున్నందున భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతేగాక ‘25 వేల యాక్టివ్‌ కేసులో 15 వేల మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. మరణాల రేటు కూడా తగ్గింది. దేశంలోనే మొట్టమొదటి కరోనా ప్లాస్మా బ్యాంకును మా ప్రభుత్వమే ప్రారంభించింది. ఇది మంచి ఫలితాలనిస్తుంది. ఈ ప్లాస్మా థెరపీతో స్వల్ఫ కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారి ఆరోగ్యం గణణీయంగా మెరుగుపడుతోంది’ అని తెలిపారు. (తొలి ప్లాస్మా బ్యాంక్‌.. విధివిధానాలు)

కాబట్టి వ్యాధి బారిన పడుతున్న వారికి రక్తదానం చేయాలని కేజ్రీవాల్‌ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రక్తదానం చేసేవారి కంటే అవసరమైన వారి సంఖ్య అధికంగా ఉందని, అర్హులైన వారందరూ ముందుకు వచ్చి రక్త దానం చేయాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇతరుల కోసం రక్తదానం చేస్తున్నవారు సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న సైనికులతో సమానమన్నారు. డిల్లీ ఆస్పత్రుల్లో‌ చేరే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందని, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందన్నారు. చాలా మంది ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారని ఆయన చెప్పారు. 

‘గతవారం రోజూకు 2,300 కొత్త కరోనా కేసులు నమోదయ్యేవి. రోగుల సంఖ్య 6,200 నుంచి 5,300 కంటే తక్కువ ఉండేవి కావు. కానీ ఆదివారం ఆస్పత్రుల్లో దాదాపు 9,900 కరోనా పడక గదులు మిగిలాయి’ అని కేజ్రీవాల్‌ నిన్న (ఆదివారం) ట్వీట్‌ చేశారు.  ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయు) పడకల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందని  ప్రభుత్వం ప్రకటించింది. నగరంలోని మూడు ప్రధాన కోవిడ్- 19 ఆసుపత్రులైన లోక్ నాయక్ (ఎల్ఎన్జెపీ), గురు తేగ్ బహదూర్(జీటీబీ), రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఐసీయు పడక గదులు 169 శాతం పెరిగాయని తెలిపింది. 

మరిన్ని వార్తలు