కేజ్రీవాల్ దుమారం

17 Dec, 2015 01:37 IST|Sakshi
కేజ్రీవాల్ దుమారం

అరుణ్ జైట్లీ తప్పుకో: పార్లమెంటులో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ డిమాండ్
 
 న్యూఢిల్లీ: ఢిల్లీలో సీఎం కార్యాలయంపై సీబీఐ దాడుల దుమారం గురువారమూ కొనసాగింది. డీడీసీఏ ఫైలు కోసమే ఢిల్లీ సీఎంవోపై సీబీఐ దాడులు జరిగాయని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా, డీడీసీఏలో నిధుల అవకతవకల కేసులో జైట్లీ రాజీనామా చేయాలంటూ.. ఆప్, కాంగ్రెస్ పార్లమెంటులో నిరసన చేపట్టాయి. ఈ కేసులో అవినీతి జరిగినట్లు ఢిల్లీ ప్రభుత్వం గుర్తించినందున జైట్లీ  పదవినుంచి తప్పుకోవాలని డిమాండ్‌చేశాయి. డీడీసీఏ వివాదంలో విచారణకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆప్ కూడా పార్లమెంటు లోపలా బయటా మోదీ సర్కారుపై విమర్శలు చేసింది.

అటు, తృణమూల్ కాంగ్రెస్.. ఆప్ ఆందోళనకు మద్దతు పలికింది. మోదీ పాలనతో సీబీఐ, జీబీఐ (గుజరాత్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)గా మారిందని టీఎంసీ పక్షనేత సుదీప్ బందోపాధ్యాయ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా టీఎంసీ సభనుంచి వాకౌట్ చేసింది. అయితే సీబీఐ.. ఢిల్లీ సీఎంవో దాడి చేయలేదని మంత్రి వెంకయ్య తెలిపారు. ‘ఏ ముఖ్యమంత్రైనా నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? ఆయన (కేజ్రీవాల్) రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు’ అన్నారు. అయితే.. విపక్షాలు లేవనెత్తుతున్న అస్పష్టమైన అంశాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని.. అవినీతి చర్చను పక్కదారి పట్టించేందుకే ఆప్, కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని జైట్లీ అన్నారు.  గురువారం  కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ను సీబీఐ 9 గంటలపాటు ప్రశ్నించింది.

 డీడీసీఏ ఫైలు కోసమే..: కేజ్రీవాల్
 డీడీసీఏ కేసుతోపాటు ఢిల్లీ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన పలు ఫైళ్లనూ అధికారులు సీజ్ చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సీఎంవోపై సీబీఐ దాడులు జరగలేదని వ్యాఖ్యానించిన జైట్లీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ‘ నా కార్యాలయంలో సీబీఐ అధికారులు డీడీసీఏ ఫైలును చదివారు. నేను మీడియాలో ఈ విషయం చెప్పటంతో.. ఆ ఫైలును అక్కడే వదిలేశారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. జైట్లీ ఆర్థిక మంత్రి సీట్లో ఉంటే నిష్పాక్షిక విచారణ జరగదని అందుకే ఆయన పదవినుంచి తప్పుకోవాలన్నారు.
 
 ఆప్ ఎంపీకి నీళ్లిచ్చిన ప్రధాని
 జైట్లీ రాజీనామా చేయాలంటూ లోక్‌సభ వెల్‌లో ఆందోళన చేస్తున్న సమయంలో ఆప్ ఎంపీ భగవంత్ మన్‌కు నిరసం వచ్చింది. ఈ సమయంలో ఆయన నీళ్ల కోసం లోక్‌సభ సెక్రటేరియట్ అధికారుల బెంచీలపై నీటికోసం చూశారు. దీన్ని గుర్తించిన ప్రధాని మోదీ.. చిరునవ్వుతో తన టేబుల్‌పై ఉన్న నీటిని ఆప్ ఎంపీకి ఇచ్చారు. నీళ్లు తాగిన ఎంపీ.. చిరునవ్వుతో ఆ గ్లాసును టేబుల్‌పై పెట్టి ప్రధాని ముఖంలోకి చూస్తూ నవ్వారు. ఆ తర్వాత ఎంపీ వెల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు.

మరిన్ని వార్తలు