గ్రేట్‌ జర్నీ: 7 గంటల్లోనే 516 కిలోమీటర్లు!

17 Nov, 2017 16:33 IST|Sakshi

తిరువనంతపురం: అతడో సాధారణ డ్రైవర్‌. తన వాహనంలో రోడ్డు మార్గంలో 516 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల్లోనే చేరుకుని ఔరా అనిపించాడు. అతడేమీ రేసులో పాల్గొని ఈ ఫీట్‌ చేయలేదు. ఒక పసిపాప ప్రాణం కాపాడేందుకు కష్టాసాధ్యమైన ఈ సాహసం చేశాడు. 14 గంటలు పట్టే ప్రయాణాన్ని సగం సమయంలోనే పూర్తి చేశాడు. అతి తక్కువ సమయంలో చిన్నారిని ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు నిలిపేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. అతడి పేరు తమీమ్‌. అత్యంత ప్రజాదరణ పొందిన మలయాళం సినిమా ‘ట్రాఫిక్‌’ను తలపించేలా కేరళలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

పసిపాప కోసం..
కేరళలోని తీర పట్టణం కాసార్‌గాడ్‌ పట్టణానికి చెందిన తమీమ్‌.. కన్నూరులోని పరియారామ్‌ మెడికల్‌ కాలేజీలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఆస్పత్రి వర్గాలు అతడికి బృహత్తరమైన కార్యాన్ని అప్పగించాయి. 31 రోజుల పసిపాప ఫాతిమా లాబియాను వీలైనంత తొందరగా అంబులెన్స్‌లో తిరువనంతపురంలోని శ్రీ చిత్ర మిషన్‌ ఆస్పత్రికి తరలించాలని అతడికి సూచించాయి. ఆమెకు అత్యవసరంగా గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయాల్సివుందని తెలిపాయి. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో మూడు గంటల్లో పాపను తిరువనంతపురం చేర్చొచ్చు. కానీ ఎయిర్‌ అంబులెన్స్‌ సిద్ధం కావడానికి 5 గంటల సమయం పడుతుందని తెలియడంతో చిన్నారిని తరలించే బాధ్యతను తమీమ్‌కు వైద్యులు అప్పగించారు. మరో ఆలోచన లేకుండా అతడు స్టీరింగ్‌ పట్టాడు.

జర్నీ సాగిందిలా..
బుధవారం రాత్రి 8.23 గంటలకు తమీమ్‌ ప్రయాణం మొదలు పెట్టాడు. స్వచ్ఛంద సంస్థ బాలల రక్షణ బృందం(సీపీటీ) సహకారంతో జర్నీ ప్రారంభమైంది. సోషల్ మీడియా ద్వారా ఈ వార్త క్షణాల్లో అందరికీ తెలిసింది. అంబులెన్స్‌ కూత వినబడగానే ప్రజలందరూ స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుని దారిచ్చారు. రోడ్డుకిరువైల ఉన్న జనం తమ ఫోన్లతో రాష్ట్ర రాజధాని దిశగా దూసుకుపోతున్న అంబులెన్స్‌ వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. పోలీసులు కూడా తమ వంతు సహకారం అందించి ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ లేకుండా చేశారు. అంతేకాదు రెండు వాహనాల్లో అంబులెన్స్‌తో పాటు ప్రయాణించారు.


                                                  తమీమ్‌ను అభినందిస్తున్న పోలీసు

పావుగంటే విరామం..
ఏడు గంటల ప్రయాణంలో కేవలం 15 నిమిషాలు మాత్రమే విరామం తీసుకున్నాడు తమీమ్‌. రాత్రి 11 గంటలకు కోజికోడ్‌ జిల్లాలోని కాకాడులో పెట్రోల్‌ బంకులో కాన్వాయ్‌ను కొద్దిసేపు నిలిపారు. అయితే పోలీసు వాహనాలు మాత్రం ప్రతి జిల్లాకు మారాయి. ఏ జిల్లాకు చెందిన పోలీసులు తమ జిల్లా సరిహద్దు వరకు అంబులెన్స్‌కు తోడుగా వచ్చారు. తమీమ్‌ మాత్రం నిరంతరాయంగా డ్రైవింగ్‌ చేస్తూనే ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున 3.23 గంటలకు అంబులెన్స్‌ తిరువనంతపురం చేరుకుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు వెంటనే ఫాతిమాను ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.

అందరికీ థ్యాంక్స్‌..
సాహసోపేతంగా సాగిన తన ప్రయాణం గురించి తమీమ్‌ ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ... తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు. రోడ్డు మార్గంలో 6.45 గంటల్లో 516 కిలోమీటర్ల దూరం చేరుకోవడం మామూలు విషయం కాదన్నాడు. అధికారులు, సీపీటీ సహకారంతోనే ఇది సాధ్యమైందని చెబుతూ ధన్యవాదాలు తెలిపాడు. ఎక్కడా కూడా వేగం 100-120 కిలోమీటర్లు తగ్గకుండా అంబులెన్స్‌ నడిపానని వెల్లడించాడు. చిన్నారి ఫాతిమాను రికార్డు సమయంలో తీసుకొచ్చినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పడంతో తమీమ్‌ నిరుత్తరుడయ్యాడు.  

మరిన్ని వార్తలు