శబరిమల; మహిళల ప్రవేశాన్ని సమర్థించినందుకు..

27 Oct, 2018 11:14 IST|Sakshi

తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని సమర్థించిన ఓ పీఠాధిపతి ఆశ్రమంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇందులో భాగంగా తిరువనంతపురం సమీపంలోని స్వామి సందీపానంద బాలికల పాఠశాల ముందు పార్క్‌ చేసి ఉన్న రెండుకార్లు, స్కూటర్లకు నిప్పంటించారు. అంతేకాకుండా దాడి చేసిన తర్వాత ఆశ్రమం ముందు ఓ పూలగుచ్ఛం కూడా ఉంచారు. ఈ ఘటన శనివారం వేకువ జామున 2. 30 నిమిషాలకు చోటుచేసుకుంది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ...సిద్ధాంతపరంగా ఒకరిని ఎదుర్కోలేని పిరికిపందలే ఇలాంటి భౌతికదాడులకు పాల్పడుతారని వ్యాఖ్యానించారు. తప్పు చేసింది ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుకు సానుకూలంగా మాట్లాడినందుకే స్వామీజీ ఆశ్రమంపై దాడి జరగడం నిజంగా సిగ్గుచేటన్నారు. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుననుసరించి కొందరు మహిళా కార్యకర్తలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా నిరసనకారులు వారిపై భౌతికదాడులకు పాల్పడ్డారు. అంతేకాకుండా వారి ఇళ్లను కూడా ధ్వంసం చేశారు.

మరిన్ని వార్తలు