స్కూల్ కు 3 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్తున్నాడు!

13 Jun, 2016 14:08 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలోని అలప్పుజాకు చెందిన ఓ కుర్రవాడు పాఠశాలకు ఈదుకుంటు వెళుతున్నాడు. మిగతా పిల్లలందరూ పడవ కోసం నది దాటడానికి ఒడ్డన ఆగి వేచి చూస్తుంటే అతను మాత్రం మూడు కిలోమీటర్ల పాటు ఈదుతూ వెళ్తాడు. ఉదయాన్నే అందరిలానే స్కూల్ కి ప్రయాణం అయ్యే అర్జున్ పాఠశాల పక్కన ఉన్న పూతోట్టలో ఉండటంతో ఆ ఊరి నుంచి తమ గ్రామానికి బ్రిడ్జి వేయాలని డిమాండ్ చేస్తూ రోజూ ఈదుకుంటూ పాఠశాలకు వెళ్తాడు. తన బ్యాగ్ లోనే స్విమ్ సూట్, కళ్లజోడును అందుబాటులో ఉంచుకునే అర్జున్ వెంబనాద్ నీటిలో ఏకధాటిగా మూడు కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా ఈదేస్తున్నాడు.

తమ గ్రామం పెరుంబలం నుంచి పూతోట్టకు  ప్రభుత్వం బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నాడు. పడవల్లో రోజూ స్కూల్ కు వెళుతుంట ఆలస్యం అవుతుందని దీంతో టీచర్లు శిక్షిస్తున్నట్లు చెప్పాడు. కొన్ని పడవలు మరీ చిన్నగా ఉంటాయి. కానీ, నదిని దాటడానికి మాత్రం ఎక్కువ మంది వేచిచూస్తుంటారు.. దీంతో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వెలిబుచ్చాడు. దాదాపు పదివేల మంది జనాభా ఉండే పెరుంబలం గ్రామ పంచాయితీ గత పాతికేళ్లుగా 700 మీటర్ల బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూనే ఉంది. అత్యవసర సమయంలో టైంకి వైద్యం అందకా గత ఏడాది దాదాపు 50 మందికి పైగా గ్రామస్థులు మరణించారు. గ్రామం నుంచి వైద్యం కోసం వెళ్లాలంటే గంటన్నరకు పైగా సమయం పడుతుందని మరో విద్యార్ధి అభిలాష్ తెలిపాడు.


అర్జున్ ఇలా ఈత కొట్టుకుంటూ నదిని దాటుతుండటం గ్రామస్థుల ద్వారా అధికారులకు తెలిసింది. 10 రోజుల సమయంలో గ్రామానికి వచ్చిన అధికారులు వారి బాధలను తెలుసుకున్నారు. కానీ, బ్రిడ్జి నిర్మాణంపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం నదిని దాటడానికి ఆరు పడవలు అందుబాటు ఉన్నాయని, అయితే ఇవి సరియైన కండీషన్ లో లేవని పంచాయితీ మెంబర్ శోభన చక్రపాణి తెలిపారు. అధికారులు వచ్చి గ్రామస్థులను కలవడంపై హర్షం వ్యక్తం చేసిన అర్జన్ ప్రస్తుతానికి ఈత కొట్టుకుంటూ స్కూల్ కు వెళ్లనని చెప్పాడు. ఒకవేళ బ్రిడ్జి నిర్మాణంపై ఎటువంటి ముందడుగు పడకపోయినా తాను మళ్లీ నదిలో నుంచి ఈదుకుంటూ వెళ్తానని తెలిపాడు.

మరిన్ని వార్తలు