కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

4 Sep, 2018 19:54 IST|Sakshi

తిరువనంతపురం : ప్రకృతి సృష్టించిన విలయానికి గురైన కేరళకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. భారీ వరదల కారణంగా కేరళ తీవ్ర నష్టానికి గురైన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ఏడాది వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించే ఇంటర్‌​నేషన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌​ కేరళ, యూత్‌ ఫెస్టివల్‌ వంటి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాలకు వెచ్చించే నిధులను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తరలించాలని నిర్ణయించింది. ఆ నిధులు కేరళ పునర్నిర్మాణంకు దోహదం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

కేరళలో ఇటీవల సంభవించిన భారీ వదలకు 350పైగా పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదారు 30,000 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ప్రకృతి విలాయానికి గురైన కేరళను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు చేయూతనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 1,036 కోట్లు విరాళాలు అందాయని ప్రభుత్వం వర్గాలు ప్రకటించాయి. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాట్‌ ఫీవర్‌తో సోమవారం మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వరదలు తెచ్చిన కొత్త వైరస్‌తో కేరళ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను రంగంలోకి దింపింది. వైరస్‌ లక్షణాలతో భాదపడుతున్న వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు