'సీఎంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి'

28 Jan, 2016 14:00 IST|Sakshi
'సీఎంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి'

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోలార్ కుంభకోణంలో ఏకంగా ఊమెన్ చాందీపైనే ఆరోపణలు రావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే దిగిపోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలు ఇలా కొనసాగుతుండగానే.. సోలార్ స్కాంలో స్థానిక విజిలెన్స్ కోర్టు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గురువారం ఆదేశించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తిరువనంతపురంలో వామపక్షాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వామపక్ష కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝళిపించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమెన్ చాందీకి సోలార్ స్కాంలో ప్రధాన నిందితులైన సరితా నాయర్, బిజు రాధాకృష్ణణ్‌తో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. చౌక ధరలకు సౌరవిద్యుత్ అందిస్తామంటూ వారు పారిశ్రామికవేత్తలను మోసగించారు. తమ రాజకీయ ప్రాబల్యం ఉపయోగించుకొని బడాబడా కాంట్రాక్టులను సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సీఎం వ్యక్తిగత సిబ్బందికి తాము రూ. 2 కోట్లు లంచం ఇచ్చినట్టు సరితా నాయర్ ప్రకటించడం కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరిన్ని వార్తలు