రాజీనామాకు సిద్ధపడ్డ కేరళ సీఎం ఒమెన్‌ చాందీ!

9 Jul, 2013 10:55 IST|Sakshi
రాజీనామాకు సిద్ధపడ్డ కేరళ సీఎం ఒమెన్‌ చాందీ!

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి ఒమెన్‌ చాందీ  రాజీనామాకు సిద్ధపడ్డారు. సౌరశక్తి పరికరాల కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయం హస్తం ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య గత రాత్రి  ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి విచారణకైనా తాను సిద్దంగా ఉన్నానని ఒమెన్ చాందీ స్పష్టం చేశారు. సోలార్ ప్యానెల్ కుంభకోణం గత నెలలో వెలుగు చూసింది.

ఈ కుంభకోణం ఏకంగా ముఖ్యమంత్రి ఒమెన్‌చాందీ మెడకే చుట్టుకుంది. ఓ ప్రైవేట్‌ బోగస్‌ సోలార్‌ కంపెనీకి చెందిన వ్యక్తులతో ముఖ్యమంత్రి కార్యాలయం సన్నిహిత సంబంధాలు కలిగి వుంటూ నిబంధనలకు నీళ్ళొదిలి అడ్డగోలుగా కాంట్రాక్టులు అప్పగించడం ద్వారా ఆ కంపెనీకి పెద్దయెత్తున అనుచిత లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

దీనిపై ఆగ్రహించిన ప్రతిపక్షం తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో పాటు  రాష్ట్రవ్యాపితంగా ఆందోళనకు దిగింది. ఒమెన్‌ చాందీ మాత్రం తాను ఏ పాపం ఎరుగనని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా అందుకు బాధ్యులైన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్‌ చేసి, దీనిపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షం మాత్రం ఈ చర్యకు ఏమాత్రం మెత్తపడలేదు. ఉమెన్ చాందీ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టింది.

ప్రభుత్వ పునాదులనే కుదిపేస్తున్న ఈ వివాదం ముఖ్యమంత్రి కార్యాలయానికి, అనేక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలెదుర్కొంటున్న ఒక మహిళతో ఉన్న సంబంధాలపై నెలకొన్నాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు టెన్నీ జోపన్‌, గన్ మెన్ సలీం రాజ్‌లు నేరారోపణ లెదుర్కొంటున్న సరితా నాయర్‌తో అనేకసార్లు వారి మొబైల్‌ ఫోన్ల నుండి, ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్‌హౌస్‌లోని ల్యాండ్‌లైన్‌ నుండి మాట్లాడారు.

సోలార్‌, పవన విద్యుత్‌ ఆధారిత విద్యుత్‌ సిస్టంలను స్థాపించే వాగ్ధానం చేస్తూ అనేకమంది మదుపుదార్లను మోసగించిన నేరంపై సరితను అరెస్టు చేశారు. అనేకమంది మదుపుదార్ల బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదుపై ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు