‘ముందు రాజ్యాంగం చదువుకోండి’

17 Jan, 2020 18:20 IST|Sakshi

తిరువనంతపురం : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించే ముందు పినరయి విజయన్‌ సర్కార్‌ తనను సంప్రదించలేదన్న కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వ్యాఖ్యలను సీఎం తోసిపుచ్చారు. అసెంబ్లీ కంటే ఏ పౌరుడు ఎక్కువ కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా ప్రతి ఒక్క అంశాన్ని పొందుపరిచిన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివేందుకు సమయం వెచ్చిస్తే బాగుంటుందని కేరళ సీఎం పినరయి విజయన్‌ గవర్నర్‌ అభ్యంతరాలపై స్పందించారు.

ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లే దేశమని, ఆయా ప్రాంతాల్లో పెత్తనం చెలాయించే రాజుల కాలం కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడూ రాజ్యాంగానికి అతీతం కాదని వ్యాఖ్యానించారు. కేరళలో తమ ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను అమలు చేయబోదని విజయన్‌ పునరుద్ఘాటించారు. మరోవైపు సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌ వేయడం వంటి అంశాల్లో కేరళ ప్రభుత్వం తనను సంప్రదించకుండా, నిబంధనలను ఉల్లంఘించిందని గవర్నర్‌ ఖాన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

చదవండి : సీఏఏకు వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీ తీర్మానం

>
మరిన్ని వార్తలు