మహిళలను అడ్డుకుంటుంది ఆరెస్సెస్‌: కేరళ సీఎం

23 Oct, 2018 14:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటుంది రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) కార్యకర్తలేనని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆరోపించారు. అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలు ఆలయంలోకి ప్రవేశించే విధంగా తాము అన్ని ఏర్పాట్లు చేశామని విజయన్‌ స్పష్టం చేశారు. కానీ ఆరెస్సెస్‌ కార్యకర్తలు మహిళలను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఆ ప్రాంతాన్ని యుద్ద ప్రాంతంగా మలిచి భయబ్రాంతులకు గురిచేశారన్నారు.

మాస పూజల కోసం గత బుధవారం ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ ఆందోళనలు చెలరేగడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ భక్తులను అడ్డుకోలేదన్నారు. ఆందోళనకారులు మాత్రమే వాహనాలను ఆపారని, మహిళా భక్తులను, మీడియా వ్యక్తులపై దాడులు చేశారన్నారు. శాంతిభద్రతల అంశంలో ఎటువంటి తప్పిదం జరగలేదన్నారు. ఆలయంలోకి ప్రవేశించిన మహిళలను అయ్యప్పను దర్శించుకోకుండా అడ్డుకున్న ఆలయ ప్రధాన పూజారి చర్యను సీఎం తప్పుబట్టారు. శబరిమలలో శాంతి నెలకొల్పడానికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక సుప్రీం తీర్పు నేపథ్యంలో సుమారు 12 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇద్దరైతే గర్భగుడికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఆగిపోయారు.

మరిన్ని వార్తలు