ఈ యాడ్‌కు..ఆవిడే సమాధానం చెప్పాలి!

18 Apr, 2019 15:48 IST|Sakshi

తిరువనంతపురం : ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలకు అతీతంగా ‘మగానుభవులైన’ నాయకులు మహిళల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మరి కొంతమంది పురుష అభ్యర్థులు తమపై పోటీకి నిలిచిన మహిళల ఓటమే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేస్తుండగా.. కేరళ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కె.సుధాకరన్‌ ఓ అడుగు ముందుకేసి ఏకంగా యాడ్‌నే రూపొందించారు. కన్నూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగి పాలక లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ కూటమి అభ్యర్థి పీకే శ్రీమతి(టీచర్‌) లక్ష్యంగా ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఇంటి పెద్ద ఒకాయన బాలికను ఉద్దేశించి... ‘ ఆమెను చదివించడం వృథా ప్రయాస. ఇక టీచర్‌ను చేయడం శుద్ధ దండుగ’ అని వ్యాఖ్యానిస్తాడు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ యాడ్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను షేర్‌ చేసిన ప్రముఖ జర్నలిస్టు ధన్యా రాజేంద్రన్‌... ‘ కన్నూర్‌ అభ్యర్థి సుధాకరన్‌ వీడియో ఇది. మహిళకు ఓటెయ్యవద్దని ఆయన చెబుతున్నారు. పురుషులను పార్లమెంటుకు పంపితేనే ఫలితం ఉంటుందని ఆయన ఉద్దేశం కాబోలు. ఇందుకు మీరు ఒప్పుకుంటున్నారా? ఈ విషయంపై సోనియా గాంధీ ఏం చెబుతారు. ఇంతవరకు సుధాకరన్‌ టీం కనీసం క్షమాపణలు కూడా కోరలేదు’ అంటూ రాహుల్‌ గాంధీని ట్యాగ్‌ చేశారు. ఇక సీపీఐ(ఎంఎల్‌) సభ్యురాలు కవితా కృష్ణన్‌ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ‘ ప్రజాస్వామ్యాన్ని కాపాడతామంటూ చెప్పుకునే.. భారతదేశంలోని ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థి.. తనకు పోటీగా నిలిచిన ఓ మహిళా నాయకురాలు, టీచర్‌కు వ్యతిరేకంగా యాడ్‌ రూపొందించి బాలికా విద్యను అపహాస్యం చేశారు. ఇండియాలో అత్యధిక అక్షరాస్యతా శాతం కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళలో ఇలాంటివి ప్రచారం చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు’ అంటూ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.

ఈ విషయం గురించి స్పందించిన మహిళా కమిషన్‌ సుమొటోగా స్వీకరించి సుధాకరన్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా మహిళను కించపరిచేలా మాట్లాడటం సుధాకరన్‌కు కొత్తేమీ కాదు. గతంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ను విమర్శించే క్రమంలో.. మహిళల కంటే కూడా ఆయన ఇంకా చెత్తగా ప్రవర్తిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు