ఆడ పిల్లలను కంటే అక్కడ గ్రాము బంగారం

4 Nov, 2017 08:30 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కల్‌ మున్సిపాలిటి. ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతంగా పేరుంది. ఇక్కడ ఆడ పిల్లలకు జన్మినిచ్చే తల్లులకు ఓ బంపరాఫర్ ప్రకటించాడు స్థానిక కౌన్సిలర్ ఒకరు. ఒక గ్రాము గోల్డ్ అందజేస్తానని ప్రకటించారాయన. 

ఆయన పేరు అబ్దుల్ రహీమ్‌. స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందిన ఆయన ఎక్కడైనా ఆడపిల్ల పుట్టిందంటే చాలూ వాలిపోయి ఆ తల్లిదండ్రులకు ఓ గ్రాము బంగారం అందిస్తారు. ఇందుకు గాను ఆయనకు అయ్యే ఖర్చు 2500 రూపాయిలు. ఆయన చేస్తున్న పనిని అభినందిస్తూ సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తుంటే.. ఆయన మాత్రం వద్దని తిరస్కరిస్తున్నారు. ‘‘నా జీతం 8000 వేలు. అందులో ఆ మాత్రం ఖర్చుపెట్టేందుకు నేను వెనకాడను. స్త్రీమూర్తులను దేవతలుగా కొలిచే మనం, కళ్ల ముందున్న వారిపై వివక్షత చూపుతూ నిర్లక్ష్యం చేస్తున్నాం. పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన చెబుతున్నారు. 

లింగ‌ నిష్పత్తిలో కేరళ రాష్ట్రం మొద‌టిస్థానంలో ఉన్నప్పటికీ(స్త్రీ-పురుష నిష్పత్తి 1084 : 1000).. భ్రూణ హత్యల నివారణే ప్రధాన ధ్యేయంగా ఈ పని చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఇప్పటిదాకా ఆయన అలా గత రెండేళ్లలో 16 మందికి బంగారు కాయిన్లు అందజేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు