స్పీడ్‌పోస్ట్‌లో మంగళసూత్రం.. ఆన్‌లైన్‌లో అతిథులు

27 May, 2020 08:10 IST|Sakshi

పుణె : కరోనా లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు చేసుకునేవారు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొందరు చాలా నిరాండబరంగా పెళ్లి చేసుకుంటుంటే.. మరికొందరు వీడియో కాలింగ్‌ ద్వారా తమ సన్నిహితులు చూస్తుండగా వివాహ బంధంతో ఒకటవుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ జంట.. పుణెలో వివాహ బంధంతో ఒకటైంది. కేరళ ఉన్న వధూవరుల కుటుంబాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి సన్నిహితులు జూమ్‌ యాప్‌ ద్వారా ఈ వేడుకను వీక్షించారు. అయితే పెళ్లికి కావాల్సిన పవిత్రమైన మంగళసూత్రాన్ని వధూవరుల తల్లిదండ్రులు కేరళ నుంచి స్పీడ్‌పోస్ట్‌లో పంపించడం విశేషం.

వివరాల్లోకి​వెళితే.. కేరళకు చెందిన విఘ్నేష్‌, అంజలిలు పుణెలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏడాది క్రితమే వీరు పెళ్లి నిశ్చయమైంది. అయితే ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వారు పుణెలో చిక్కుకుపోవాల్సి వచ్చింది. అయితే ఇందుకు వారు ఏ మాత్రం నిరాశ చెందలేదు. ముందుగా నిర్ణయించిన రోజునే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వరుడు విఘ్నేష్‌ నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో ఈ వివాహం జరిగింది. ఇందుకు పుణెలోని విఘ్నేష్‌, అంజలి ఫ్రెండ్స్‌ తగిన ఏర్పాట్లు చేశారు.


వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పెళ్లిని వీక్షిస్తున్న వధూవరుల సన్నిహితులు

‘అంతా బాగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు, బంధువులు ఆన్‌లైన్‌లో మా పెళ్లిని వీక్షించారు. ఇది చాలా భిన్నమైన అనుభూతి.. కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని విఘ్నేష్‌ అన్నారు. ‘లాక్‌డౌన్‌ ప్రారంభమైన కొత్తలో మే తొలి వారంలోనైనా మేము ఇళ్లకు చేరుకుంటామని అనుకున్నాం. ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఇళ్లకు వెళ్లలేమని అర్థమైంది. అయినప్పటికీ మేము మా పెళ్లిని వాయిదా వేసుకోవాలని అనుకోలేదు’ అని అంజలి చెప్పారు. అలాగే సమయానికి మంగళసూత్రం డెలివరీ చేసిన ఇండియన్‌ పోస్టల్‌ శాఖకు నూతన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు