కరోనా: మరణం అంచుల నుంచి వెనక్కి వృద్ధులు!

31 Mar, 2020 10:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: దేశమంతా కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కేరళ ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చే కబురు చెప్పింది. ప్రాణాంతక వైరస్‌ కోవిడ్‌-19 బారిన పడిన 93 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్య(88), కుటుంబం కోలుకున్నారని తెలిపింది. ఈ మేరకు.. ‘‘మరణం అంచుల నుంచి ఆ వృద్ధ దంపతులను వెనక్కి తీసుకువచ్చాం’’ అంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కేకే శైలజ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలు... బాధిత వృద్ధ జంటకు ఇటలీ నుంచి వచ్చిన వారి పిల్లలు, మనువడి ద్వారా కరోనా సోకింది. (కరోనా వైరస్‌: వారిపైనే ఫోకస్‌)

ఈ నేపథ్యంలో తీవ్ర దగ్గు, ఛాతి నొప్పి, గుండె సంబంధిత వ్యాధి ఎక్కువవడంతో ఆ వృద్ధుడిని వెంటలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఇక ఆయన భార్యకు సైతం మూత్ర సంబంధ వ్యాధి, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో కొట్టాయం మెడికల్‌ కాలేజీని వీఐపీ ఐసీయూ గదులలో వారికి చికిత్స అందించిన డాక్టర్లు.. ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడటంతో సాధారణ అత్యవసర విభాగం గదికి మార్చారు. ఒకరికొకరు దగ్గరగా ఉండేలా పక్కపక్కనే బెడ్లు కేటాయించారు. (కరోనా: గుడ్‌న్యూస్‌ చెప్పిన జర్నలిస్టు)

అదంతా ఆమె చలవే..
వృద్ద దంపతుల ఆరోగ్యం మెరుగుపడటంతో వారిని ఇంటికి పంపించాలని ఆస్పత్రి వర్గాలు భావించాయి. అయితే వారు మాత్రం ఇంటికి వెళ్లడానికి ససేమిరా ఒప్పుకోలేదు.. అంతేకాదు ఆహారం తీసుకోవడానికి కూడా నిరాకరించారు. దీంతో వారికి సేవలు అందించిన ఓ నర్సు... నచ్చజెప్పి మానసికంగా ధైర్యంగా ఉండాలంటూ వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ ఆమెకు కూడా కరోనా అంటుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేకే శైలజ వ్యక్తిగతంగా ఆమెను కలిసి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా దేశంలో అత్యధికంగా 194 కరోనా పాజిటివ్‌ కేసులతో కేరళ ముందు వరుసలో ఉంది. 

మరిన్ని వార్తలు