చెదిరిన గూడు

21 Aug, 2018 19:59 IST|Sakshi

సర్వం కోల్పోయి.. కట్టుబట్టలతో మిగిలిన కేరళ వాసులు

ఇళ్లకు చేరుతున్న వరద బాధితులు

ఊహించని విలయం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నీటి ప్రవాహం ముంచెత్తడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రాణాలు దక్కించుకున్నారు. బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీశారు. ప్రకృతి ప్రకోపం చల్లారింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి కొంతమంది ఇప్పుడిప్పుడే ఇళ్లకు వస్తున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న సామాగ్రి.. ఎటు చూసిన బురద.. వారికి దర్శనమిచ్చాయి. ఆ ఇంట్లోని వస్తువులను తలచుకుంటూ, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కన్నీటి వరదలో ఇళ్లను పునర్నిర్మించుకునే పనిలో పడ్డారు.

ఒక్క క్షణం ఆలస్యమైతే బతికేవాడ్ని కాదు
‘మా ఇంట్లోకి పది అడుగుల వరకు నీళ్లు వచ్చేశాయి. ఐదు రోజుల పాటు ఆ నీళ్లు అలానే ఉన్నాయి.. ప్రస్తుతం మా ఇల్లు యుద్ధభూమిని తలపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ఎర్నాకుళం జిల్లాలోని మంజలే గ్రామానికి చెందిన అబ్దుల్‌ సలాం. ‘ఆగస్టు 14వ తేదీ రాత్రి నీటి ప్రవాహం మా ఇంటివైపు రావడం గమనించాను. వెంటనే మా పక్కింటి వాళ్లను అప్రమత్తం చేసి మా మొదటి అంతస్తులోకి నేను, నా భార్య వెళ్లిపోయాం. సురక్షితంగా ఉన్నామని భావించా. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగింది. ట్రెరస్‌కు కొద్ది దూరం వరకు నీళ్లు వచ్చేశాయి. స్థానికులు ఓ పడవలో వచ్చి మమ్మల్ని రక్షించారు. మొదట నా భార్య పడవలోకి వెళ్లింది. నేను ఆమె చీరను పట్టుకుని పడవలోకి దూకేందుకు ప్రయత్నించాను. అయితే కాలు జారి నీళ్లలో పడిపోయాను. వెంటనే బోటులో ఉన్న వారు స్పందించి నన్ను పట్టుకుని పైకి తీశారు. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే నా ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి’ అంటూ ఆనాటి భయానక సంఘటనను గుర్తు చేసుకున్నారు సలాం. ‘గోడకు ఉన్న అల్మారాలో నా ఇద్దరు పిల్లలు స్కూలు, కాలేజీ రోజుల్లో సాధించిన ట్రోఫీలు, మెడల్స్‌ భద్రంగా దాచాను. వరదలకు అవి కొట్టుకుపోయాయి. ఆ ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

సర్టిఫికెట్లు మాత్రమే మిగిలాయి..
చాలకుడి ప్రాంతానికి చెందిన సురేష్‌ జాన్‌ కుటుంబం రెండంతస్తుల భవనంలో ఉంటున్నారు. పది అడుగుల వరకు నీళ్లు రావడంతో  ఇంట్లో వారి కుక్కను వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇంటి నుంచి పునరావాస కేంద్రానికి వెళ్లారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఇంటికి చేరారు. బురద, మరకలతో భయంకరంగా భయంకరంగా ఉన్న గోడలు వారికి దర్శనమిచ్చాయి. ఫర్నీచర్‌ అంతా ఓ చోట కూప్పగా పడి ఉంది. పుస్తకాలు అల్మారాలోనే నానిపోయి ఉన్నాయి. ప్రతీ గదిలోనూ బురద పేరుకుపోయింది. ‘ఇంటి పరిస్థితి చూస్తే నాకు మాటలు రావడం లేదు. నేను చాలా విచారంలో ఉన్నాను. సర్వం కోల్పోయాను, మా కుటుంబం మామూలు స్థితికి  రావడానికి చాలా సమయం పడుతుంది. నా దగ్గర డబ్బులు కూడా లేవు’ అంటూ జాన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. మొదటి అంతస్తులో ఉందామని మొదట అనుకున్నాం. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంప్‌కు వెళ్లాం. నా బట్టలు, పాత, కొత్త పుస్తకాలు, ఫైల్స్, పేపర్లు అన్నీ పాడైపోయాయి. సర్టిఫికెట్లు జాగ్రత్తగా దాచుకోవడంతో అవి మాత్రమే మిగిలాయి’.అంటూ వాపోయారు ఎల్సా జాన్‌. అయితే, వారి కుక్క మాత్రం సురక్షితంగా తిరిగి వచ్చింది.

మానసిక ఆందోళనలో ఉన్నారు
ఓ పునరావాస కేంద్రంలో ఉన్న ఓ వృద్ధుడు ఛాతిలో నొప్పిగా ఉందని క్యాంప్‌లో సేవలందిస్తున్న వైద్యుడు రఫీక్‌ను కలిశాడు. అతన్ని పరీక్షించిన వైద్యుడు.. రోగం సంగతి ఎలా ఉన్నా ‘ముందు నువ్వు మీ ఇంటికి వెళ్లొద్దు.. మీ కొడుకు ఇల్లు మొత్తం శుభ్రం చేశాకే ఇంటికి వెళ్లు’  అని చెప్పాడు. దీన్ని బట్టి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ‘ఎంతో కష్టపడి చాలా మంది తమ ఇళ్లను నిర్మించుకున్నారు. ఆ ఇంటితో వారికి విడదీయరాని బంధం, అనుబంధం ఉంటుంది. ఇప్పుడున్న స్థితిలో ఆ ఇంటిని చూస్తే వారు తట్టుకోలేరు. వారంతా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. శారీరకంగా ధృడంగా ఉన్న వారు కూడా బోరున విలపిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు డాక్టర్‌ రఫీక్‌.

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు