నాటి సహాయక చర్యలు నేటికి స్ఫూర్తి

21 Aug, 2018 18:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ... ఏ ల్యాండ్‌ ఆఫ్‌ బ్యూటీ.. ఏ ల్యాండ్‌ ఆఫ్‌ ప్లెంటీ... ఏ ల్యాండ్‌ ఆఫ్‌ పీస్‌’గా ప్రసిద్ధి కెక్కిన కేరళలో జల ప్రళయం సంభవించడం ఇదే మొదటి సారి కాదు. అనేక సార్లు కేరళలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా 1924, 1999లో వచ్చిన వరదలు అపార ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగించాయని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. ‘వాటర్‌! వాటర్‌ ఎవ్రీవేర్‌’ అన్న వ్యాఖ్యంతో ప్రముఖ మలయాళ రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత థకాజి శివశంకరన్‌ పిల్లై నవల ‘ఇన్‌ ది వాటర్‌’ మొదలవుతుంది. ‘టావన్‌కోర్‌లో అది అతిఎత్తైన దేవాలయం. దాని శిఖరంపై 67 మంది పిల్లలు, 350 మంది పెద్దలు, గొర్రెలు, మేకలు, పెంపుడు జంతువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని వారాలుగా భారీ వర్షాలు కురవడంతో వందలాది మానవులు, వేలాది జంతువుల ప్రాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లూ, జీవనాధార పంటలు నీటి పాలయ్యాయి. నీటిలో గర్భవతులు, పిల్లల నరక యాతన వర్ణనాతీతం’ అని 1924లో సంభవించిన వరదల గురించి థకాజి తన పుస్తకంలో వర్ణించారు. ఆయన అలప్పూజ జిల్లాలోని థకాజి గ్రామంలో జన్మించడంతో ఆయన ఊరిపేరుతోనే ఆయన్ని పిలిచేవారు.

1924లో జూలై నెలలో వరదలు వచ్చాయి. వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు ఆగస్టు మొదటి వారంలో అనేక ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. అలా అంబాలపూజలో 4,000 మందికి, అలెప్పి శిబిరంలో 3,000 మందికి, కొట్టాయంలో 5,000 మందికి, ఛంగనస్సరీలో 3,000 మందికి, పరూర్‌లో 8,000 మందికి ఆశ్రయం కల్పించారు. ఇవే కాకుండా ఇంకా అనేక చోట్ల నాడు ఆశ్రయం కల్పించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘మన్నార్‌ ఫ్లడ్‌ రిలీఫ్‌ డిప్యూటేషన్‌’ నివేదిక ప్రకారం నాడు వరదల వల్ల ఒక్క మధ్య ట్రావన్‌కోర్‌ ప్రాంతంలోనే 500 ఇళ్లు, 200 కొబ్బరి తోటలు, వెయ్యి ఎకరాల భూమి, 6,40,000 కిలోల ధాన్యం నీటి పాలయ్యాయి.
 
నాడు బ్రిటీష్‌ మద్రాస్‌ పాలకులు వరద సహాయక చర్యల కోసం నిపుణుడైన టి. రాఘవయ్యను నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సహాయక కమిటీ ఏర్పాటై నిరంతరగా పనిచేసింది. అప్పటి ట్రావన్‌కోర్‌ పాలకుడు  మహారాజ మూలమ్‌ తిరునాల్‌ ఆ ఏడాదికి ప్రజల పన్నులన్నింటిని రద్దు చేశారు. వ్యవసాయ రుణాల కోసం నాలుగు లక్షల రూపాయలను కేటాయించారు. ఈ దిశలో ఆయన కన్నుమూశారు. అప్పట్లో కూడా మూడు రోజులపాటు సంతాప దినాలు పాటించాలి. ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించరాదు. అయితే ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన సేతు లక్ష్మీ భాయ్‌ సహాయక చర్యలను అధికారికంగా అనుమతించారు. ఎప్పటికప్పుడు రాఘవయ్యతో పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నారు.

రైతుల వ్యవసాయ రుణాల బడ్జెట్‌ను నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదున్నర లక్షల రూపాయలకు పెంచారు. పేదల ఇళ్ల పునర్నిర్మాణం కోసం అడవిలోని వెదురు చెట్లను ఉచితంగా కొట్టుకొని తెచ్చుకునే హక్కును కల్పించారు. పదివేల మంది రైతులకు ఐదు వందల రూపాయల చొప్పున నాడు రుణాలు అందజేశారు. రైతుల ఆర్థిక పరిస్థితిని బట్టి వడ్డీ రేటును 6.25 శాతం నుంచి ఆరుకు, అంతకన్నా తక్కువకు తగ్గించారు. కొన్ని లక్షల రూపాయలతో రోడ్లు, మంచినీటి సౌకర్యాలను పునరుద్ధరించారు. అప్పుడు ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలి వచ్చారు. అప్పటి వరకు తన పట్టాభిషేక ఉత్సవాన్ని వాయిదా వేసుకున్న రాణి లక్ష్మీ భాయ్‌ ఆ తర్వాత ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకున్నారు.

మను ఎస్‌ పిళ్లై రాసిన ‘ది ఐవరీ త్రోన్‌: క్రానికల్స్‌ ఆఫ్‌ ది హౌజ్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌’ పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. నేటి పాలకులకు స్ఫూర్తి కోసం నాటి వివరాలు.

సంబంధిత కథనాలు:

పునరావాసమే సవాల్‌!

ఎందుకు ఎయిర్‌ పోర్టుల్లోకి వరదలు?

సామాన్యులే రియల్‌ హీరోలు

మనిషి పుడతాడు కష్టంలో

కేరళలో ఎందుకీ వరదలు?

మరిన్ని వార్తలు