కేరళ వరదలు: యూపీలో ఘాటెక్కిన ధరలు 

24 Aug, 2018 19:49 IST|Sakshi
మసాలా దినుసులు (ఫైల్‌ ఫోటో)

లక్నో :  గడిచిన వందేండ్లలో ఎన్నడూలేనంతగా వరదలు సృష్టించిన బీభత్సానికి కేరళ వాణిజ్య పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కాఫీ, టీ, యాలకులు, మిరియాలు, రబ్బరు, అరటి తోటలన్నీ నేలకొరిగాయి. ఆరుగాలం కష్టించిన రైతన్నలకు ఇక కన్నీళ్లే మిగిలాయి. దీంతో ఒక్కసారిగా ధరల వాత కూడా మోగిపోతుంది. కేరళ వరదలతో ఉత్తరప్రదేశ్‌లో ధరలు హీటెక్కాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ మార్కెట్‌ అన్నింటిల్లోనూ మసాలా దినుసుల ధరలు ఘాటుఘాటుగా ఉన్నాయని తెలిసింది. కేరళ మసాలా దినుసుల ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తిదారిగా ఉంది. 

కేరళ నుంచి సప్లై ఆగిపోవడంతో, తూర్పు యూపీలో అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌గా ఉంటున్న వారణాసిలోని దీననాథ్‌ మార్కెట్‌లో మసాలా దినుసుల ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు తాజా గణాంకాల్లో వెల్లడైంది. కేరళను ముంచెత్తిన వరదలతో గత రెండు వారాల నుంచి దీననాథ్‌ మార్కెట్‌లోకి మసాలా దినుసుల సరఫరా తగ్గిపోయిందని ట్రేడర్‌ రామ్‌ జి గుప్తా తెలిపారు. ఈ కొరతతో ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు చెప్పారు. నల్లమిరియాల ధరలు కేజీకి 315 రూపాయల నుంచి 400 రూపాయలకు పెరిగాయని, యాలుకల ధరలు కేజీకి 1300 రూపాయల నుంచి 1700 రూపాయలు పెరిగినట్టు మరో ట్రేడర్‌ అనిల్‌ కేసరి తెలిపారు. ఇక లవంగం ధరలు కేజీ 600 రూపాయలుంటే, ఇప్పుడు 700 రూపాయలున్నట్టు చెప్పారు. ఇతర మసాలాల ధరలు కూడా ఇదే విధంగా పెరిగాయని చెప్పారు. 

ఇక ఫతేపూర్‌ జిల్లా హోల్‌సేల్‌ మార్కెట్‌లో కూడా మసాలాల ధరలు దాదాపు 30 శాతానికి పైగా ఎగిసినట్టు తెలిసింది. ధరల పెంపుపై స్పందించిన స్థానిక వర్తకులు.. యాలుకల ధరలు కేజీకి 1200 రూపాయల నుంచి 1600 రూపాయలు పెరిగినట్టు చెప్పారు. ఒకవేళ మసాలాలు త్వరగా మార్కెట్‌కు రాకపోతే, వీటి ధరలు 50 శాతానికి పైగా పెరిగే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. బరేలి హోల్‌సేల్‌ మార్కెట్‌లో కూడా వీటి ధరలు 15 శాతం కాకపుట్టిస్తున్నాయి. కేరళలో సృష్టించిన ఈ ప్రకృతి విలయతాండవం దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కూడా ప్రభావం చూపుతుంది. మసాలాలు మాత్రమే కాక, కొబ్బరి సప్లై కూడా నిలిచిపోయిందని అలహాబాద్‌ జిల్లా హోల్‌సేల్‌ మార్కెట్‌ చెబుతోంది. మార్కెట్‌లో వీటి కొరత ఎక్కువగా ఉండటంతో, ధరలు మరింత హీటెక్కుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఈసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు