కొచ్చి విమానాశ్రయానికి భారీ నష్టం

22 Aug, 2018 13:55 IST|Sakshi

కొచ్చి విమానాశ్రయానికి  రూ. 250 కోట్ల భారీ నష్టం

పెద్ద ఎత్తున పునరుద్ధరణ పనులు

 రాత్రింబవళ్లూ  శ్రమిస్తున్న సిబ్బంది

26 ఆగస్టునుంచి సేవలు పునఃప్రారంభయ్యే అవకాశం

కొచ్చి : ప్రకృతి బీభత్సానికి విలవిల్లాడిన కేరళ ఇపుడిపుడే కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఎడతెగని వర్షాలు, వరదలతో రాష్ట్రానికి తీరిని నష్టం వాటిల్లింది. ప్రాణనష్టంతోపాటు, ఆస్తినష్టం భారీగా నమోదైంది.  రోడ్డు, రైలు తదితర రవాణా వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారిపోయాయి. జిల్లాలోని అనేక రోడ్డుమార్గాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా వరదల్లో  చిక్కుకున్న కొచ్చి అంతర్జాతీయ  విమానాశ్రయం భారీగా నష్టపోయింది. ఆగస్టు 15నుంచి విమాన సర్వీసులు నిలిపివేసిన  ఈ విమానాశ్రయ నష్టం 200 నుంచి 250 కోట్ల  రూపాయల దాకా వుండవచ‍్చని అధికారులు అంచనా వేశారు.

కేరళలో అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం కొచ్చి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులద్వారా అత్యధిక ఆదాయాన్ని సాధిస్తుంది.  అయితే వరదల కారణంగా  రన్‌వే మొత్తం నీటితో నిండిపోవడంతో విమానాశ్రయాన్ని ఆగస్టు 26వ తేదీవరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వరద పరిస్థితి శాంతించడంతో తమ సేవల్ని  పునరుద్ధరించడానికి 24 గంటలూ శ్రమిస్తున్నామనీ, ప్రస్తుతం, రన్‌వేను బాగు చేస్తున్నామని   కొచ్చి విమానాశ్రయాధికారి అధికారి ఒకరు చెప్పారు. 250 కి పైగా ప్రజలు ఈ పునరుద్ధరణ ప్రయత్నాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని  పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌ జయనా  తెలిపారు. ఆగస్టు  26  నుంచి తమ విమాన సేవలు పునఃప్రారంభయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

పూర్తిగా సోలార్‌ ప్యానెల్స్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ కార్యాలయంలో ఎనిమిది విద్యుత్  స్టోరేజ్‌ ప్లాంట్లలో నాలుగు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.  సోలార్‌ పానళ్ళలో 20 శాతం దెబ్బతిన్నాయి.  ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాం . ఒక నెలలోనే సాధారణ పరిస్థితికి చేరుకుంటామని పీఆర్‌వో చెప్పారు. వీటి మరమ్మతులకు దాదాపు 10కోట్ల రూపాయలదాకా ఖర‍్చవుతుందని అంచనావేశామని తెలిపారు. అయితే  విమానాశ్రయానికి మొత్తానికి  బీమా ఉన్నకారణంగా రూ. 250 కోట్ల అంచనా నష్టం తమకు బీమా సంస్థ నుంచి పరిహారం లభించే అవకాశడం ఉండటం ఊరటనిచ్చే అంశం.

మరిన్ని వార్తలు