కేరళ పండుగ కళ తప్పింది

22 Aug, 2018 05:36 IST|Sakshi

మొన్న నిఫా, నేడు వరద బీభత్సం

మొన్న నిఫాతో బెంబేలెత్తిన స్వర్గసీమ కేరళ నిన్న వరదబీభత్సానికి చివురుటాకులా వణికిపోయింది. చిన్నా చితకా వ్యాపారాలు మొదలుకొని రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ వరకూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కేరళ అనగానే గుర్తొచ్చే పూల పండుగ పది రోజులపాటు ప్రతిఇంటా ఆనందాలు వెల్లవిరిసేవి. బంతులు, చామంతులూ, మల్లెలూ ఒకటేమిటి అన్ని పూలూ కేరళని ముంచెత్తేవి. ఓనమ్‌ పండుగ పదిరోజులూ ప్రతి ఇంటా పూల తివాచీలే పరిచేవారు. కానీ ఈసారి వరదలు సృష్టించిన బీభత్సం కేరళ ప్రజల జీవితాలను చిందరవందరచేసింది. వ్యాపారుల దగ్గర్నుంచి పూలుకొనేవాళ్ళే కరువయ్యారు. ప్రతియేటా ఇదే సీజన్‌లో జరిగే కేరళ ప్రసిద్ధ ఓనమ్‌ పండుగకు దాదాపు 800 టన్నుల పూల వ్యాపారం జరిగేది. కేరళ సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులోని తిరునాల్‌వేలి నుంచి తరలివచ్చే పూల వ్యాపారులకు ఈ ఏడాది నిరాశే ఎదురయ్యింది. ఒక్క తిరునాల్‌వేలి నుంచే కాకుండా హోసూర్, కోయంబత్తూర్, కన్యాకుమారి, బెంగుళూరుల నుంచి వచ్చే పూల వ్యాపారులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. 

మతాలకతీతంగా కేరళ ప్రజలు జరుపుకునే ఓనమ్‌ పండుగ సందర్భంగా కేరళలో జరిగే మొత్తం వ్యాపారమే కీలకం. ఎలక్ట్రానిక్స్, బట్టల వ్యాపారంలో 15 శాతం బిజినెస్‌ ఈ పండుగ రెండు వారాల్లోనే జరుగుతుంది. మాల్స్, సూపర్‌ మార్కెట్స్, బట్టల షాపులు పండుగ ఆఫర్లతో వ్యాపారం మరింత జోరుగా సాగేది. అయితే ఈసారి అటువంటి పరిస్థితికి ఆస్కారమే లేదని త్రిస్సూర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు టిఆర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

కేరళ రాష్ట్రానికి అధికాదాయ వనరు అయిన పర్యాటకరంగం వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నది. కేరళ లోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడటంతో చాలా మంది టూరిస్టులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. అలప్పుజా, మున్నార్, కుమరకమ్, పెరియార్‌ లాంటి ప్రధాన పర్యాటకప్రాంతాల్లో దాదాపు 95 శాతం పర్యాటకులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. 

’’రోడ్లు పునర్‌నిర్మించాలి. పర్యాటక ప్రాంతాలను ప్రజల సందర్శనార్థం పునః ప్రారంభించాలంటే కొంత సమయం పడుతుంది. ఇదంతా సజావుగా సాగడానికి ఒకటి రెండు నెలలు పడుతుంది. సహజంగానే స్థానిక ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్రజలు ఇష్టపడరు’’ అని ఎయిర్‌ ట్రావెల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇఎం నజీబ్‌ తెలిపారు. కేరళలో పర్యాటకుల తాకిడి అక్టోబర్‌ నుంచి ప్రారంభం అవుతుంది. ఈసారి మాత్రం 70 నుంచి 80 శాతం రెవెన్యూకి గండిపడుతుందని భావిస్తున్నారు. ప్రకృతి వైద్యం కోసం, ఇతర ఆరోగ్య అవసరాలకోసం ప్రతియేటా చాలా మంది వివిధ ప్రాంతాలనుంచి కేరళకి వెళుతుంటారు. అయితే ఈసారి మెడికల్‌ టూరిజం కూడా 50 శాతం నష్టపోయిందని ధాత్రి ఆయుర్వేద ఎండి, సిఐఐ కేరళ అధ్యక్షుడు డాక్టర్‌ సాజికుమార్‌ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఒక్క పేషెంట్‌ కూడా రావడం లేదనీ మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందనీ ఆయన వివరించారు. 

కేరళ ప్రభుత్వం రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించింది. పనిదినాలు, పర్యాటకుల పర్యటనల రద్దు, ఇతరత్రా అన్నీ కలుపుకొని 25,000 కోట్ల రూపాయల వరకూ రాష్ట్రం నష్టపోయినట్టు అంచనా వేసారు. అయితే ఇంత నష్టం జరిగినా కేరళల ప్రజలు, అధికారులు, సాధారణపౌరులూ, వైద్యులూ తమకు తోచిన విధంగా కేరళ పునర్‌నిర్మాణంలో తమవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. 

కొచ్చిలోని అస్తర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ క్లినిక్స్‌ సిఇఓ డాక్టర్‌ హరిప్రసాద్‌ పిళ్ళై మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా తమ ఆసుపత్రిలో పనిచేసే 80 మంది డాక్టర్లు, 150 మంది నర్సులు 20 పునరావాస కేంద్రాల్లోనూ, కొచ్చీ, కలమస్సేరిలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రజాసేవలో మునిగి ఉన్నారని తెలిపారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్, అధికారుల తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. వైద్య పరంగా ఈ యేడాదిలో నిఫా వైరస్‌ తర్వాత కేరళ ప్రజలెదుర్కొన్న రెండవ ఛాలెంజ్‌ ఇదేనని ఆయన అన్నారు. 


 

మరిన్ని వార్తలు