ఆరు రోజులు ప్రత్యక్ష నరకం

22 Aug, 2018 08:21 IST|Sakshi
కేరళను ముంచిన వరదలు

వాళ్లంతా మానసిక వికలాంగులు.  చుట్టూ వరద నీరు ముంచేస్తున్నా ఏం జరుగుతోందో గ్రహించుకోలేని నిస్సహాయులు. ఆరు రోజులు బయట ప్రపంచంలో ఏమవుతోందో తెలీక, తమ ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయనే విషయాన్ని తెలుసుకోలేక నీళ్లల్లోనే అలా కాలం గడిపేశారు.  చివరికి ఎలాగోలా సహాయబృందాలు వారున్న చోటుకి వెళ్లగలిగాయి. వారి ప్రాణాలు కాపాడాయి. కేరళ తిస్సూరు జిల్లాలోని మురింగూర్‌ అనే మారుమూల ప్రాంతంలోని మానసిక రోగుల సంరక్షణ కేంద్రంలో 400 మంది వరకు రోగులు ఉంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారంతా తట్టబుట్ట సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోతే, వరద నీరు మింగేస్తోందని కూడా తెలుసుకోలేని వారంతా అక్కడే ఉండిపోయారు. గుబురుగా ఉండే చెట్ల మాటున ఉండే ఆ కేంద్రం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండడంతో వారి ఆలనాపాలనా పట్టించుకునేవారే లేకపోయారు. 

అయితే అక్కడ స్థానిక బ్లాక్‌ పంచాయితీ సభ్యుడు థామస్‌ మాత్రం ఎంతో బాధ్యతగా వ్యవహరించారు.  మొదటి అంతస్తులోకి నీళ్లు వచ్చేయడంతో వాళ్లని జాగ్రత్తగా పై అంతస్తులోకి తరలించారు.  ప్రతీరోజూ చిన్న మరబోటులోనే ఆ కేంద్రానికి కొంచెం కొంచెం ఆహార పదార్థాలను తీసుకువెళ్లి వాళ్లకి తినిపించేవారు. అలా ఆరు రోజులు గడిచాక ఎలాగైతేనేం సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. థామస్‌ ఆ సహాయ బృందాలకు ఎదురేగి మానసిక వికలాంగుల పరిస్థితిని వివరించారు. కానీ వరదనీరు భారీగా చుట్టుముట్టేయడంతో వారందరినీ తరలించడం చాలా క్లిష్టంగా మారింది. ఆహారం, మందులు లేకపోవడంతో ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కూడా కోల్పోయారు. థామస్‌ సహకారంతో మిగిలిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

తిస్సూర్‌ జిల్లాలోని ఆ మారుమూల ప్రాంతానికి సహాయ బృందాలు చేరుకోవడం ఇదే ప్రథమం. గతంలో విపత్తులు సంభవించిన సమయంలోనూ అక్కడికి ఎవరూ వెళ్లలేకపోయారు.  కానీ ఈ సారి సహాయ బృందాలు మెడలోతు నీళ్లల్లో 3 కి.మీ. నడుచుకుంటూ వెళ్లి మరీ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆ గ్రామ ప్రజలనే కాదు మానసిక స్థితి సరిగా లేని వారి ప్రాణాలను కాపాడారు. అయితే ఇన్ని రోజులూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన థామస్‌ని రియల్‌ హీరో అంటూ స్థానికులు కొనియాడుతున్నారు. 

>
మరిన్ని వార్తలు