కేరళ వరదలు : డాబాపై అతిపెద్ద ‘థ్యాంక్స్‌’

20 Aug, 2018 15:36 IST|Sakshi

కొచ్చి : ప్రకృతి ప్రకోపానికి కేరళ చివురుటాకులా వణికిపోతుంది. కేరళను ముంచెత్తిన వర్షాలతో ఎక్కడ చూసినా హృదయవిదారకర సంఘటనలే కనిపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి నేవి, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, కోస్ట్‌ గార్డ్స్‌ అందిస్తున్న సహాయం అంతా ఇంతా కాదు. రేయింబవళ్లు శ్రమిస్తూ.. వరదల్లో బిక్కుబిక్కుమంటున్నవారిని పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. సరైన సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర ప్రభుత్వ బృందాలు రావడంతోనే తాము ప్రాణాలతో బయటపడగలిగామని బాధితులు కృతజ్ఞత భావంతో కన్నీంటిపర్యంతమవుతున్నారు. 

ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవి ఇతర బలగాలు అందిస్తున్న సహాయ చర్యల వీడియోలు, ఫోటోలు ఎప్పడికప్పుడూ సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతూనే ఉన్నాయి. బలగాలు అందిస్తున్న సహాయ చర్యలకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతల మెసేజ్‌లు పంపిస్తూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే కొచ్చిలోని ఓ ఇంటి నుంచి నేవి రెస్క్యూ ఆపరేషన్స్‌కు అతిపెద్ద కృతజ్ఞత అందింది. అదేమిటంటే.. కొచ్చిలో ఓ ఇంటి డాబాపై అతిపెద్దగా ‘థ్యాంక్స్‌’ చెబుతూ పేయింట్‌ చేశారు. నేవి రెస్క్యూ ఆపరేషన్స్‌కు సెల్యూట్‌ చెబుతూ ఈ ‘థ్యాంక్స్‌’ మెసేజ్‌ పేయింట్‌ చేశారు. గత మూడు రోజుల క్రితమే ఆ ఇంటి నుంచి ఇద్దరు మహిళలను నావల్‌ ఏఎల్‌హెచ్‌ పైలెట్‌ సీడీఆర్‌ విజయ్‌ వర్మ కాపాడారు. ఈ ‘థ్యాంక్స్‌’ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యూలేట్‌ అవుతుంది. 

ఇది కేవలం ప్రజల మన్ననలు పొందడమే కాకుండా.. కేరళలో రెస్క్యూ ఆపరేషన్స్‌ అందిస్తున్న వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉందని సోషల్‌ మీడియా యూజర్లు అంటున్నారు. ఈ థ్యాంక్స్‌ మెసేజ్‌కు.. ‘ఇది మా ఇండియా’ అని ఒక యూజర్‌ ట్వీట్‌ చేశాడు. మరో యూజర్‌ వావ్‌.. ఇది నేవి, మిలటరీ, ఎయిర్‌ ఫోర్స్‌, వాలంటీర్స్‌, ఇతరులకు మంచి బూస్ట్‌ను అందిస్తుందని చెప్పాడు. ఇటీవల నొప్పులతో సతమతమవుతున్న ఓ గర్భవతిని నేవి సిబ్బంది కాపాడిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా.. కేరళలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుణుడి ప్రకోపానికి బలైన కేరళకు యావత్‌ దేశం తమ వంతు సహాయం అందిస్తోంది. భారీ ఎత్తున విరాళాలు, ఆహారం, దుస్తులు పంపుతున్నారు. వరదల తాకిడికి తట్టుకోలేక ఇప్పటికే అక్కడ 370 మంది ప్రాణాలు విడిచారు. 19వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించిన మోదీ, కేరళకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లను ప్రకటించారు.  

మరిన్ని వార్తలు