చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కేరళ ప్రభుత్వం దృష్టి..

20 Nov, 2015 00:08 IST|Sakshi
చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కేరళ ప్రభుత్వం దృష్టి..

గతేడాది సంచలం సృష్టించిన కిస్ ఆఫ్ లవ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా కేరళలో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై కేరళ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు హోం మంత్రి వెల్లడించారు.  గతేడాది రాష్ట్రంలో జరిగిన వివాదాస్పద 'కిస్ ఆఫ్ లవ్' నిరసనపై దర్యాప్తు ప్రారంభించినట్లు కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల తెలిపారు. ఆన్ లైన్ వ్యభిచారం, సెక్స్ ట్రేడ్,  వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నిరసనలో పాల్గొన్న వారందరికీ క్రిమినల్ ఉద్దేశ్యాలు ఉన్నట్లుగా చెప్పలేమని... కోచి ఆన్ లైన్ వ్యభిచారం కేసులో ఉద్యమ నిర్వాహకులతో  మొత్తం పదిమందిని అరెస్ట్ చేసిన ఓ రోజు తర్వాత ఆయన స్పందించారు.  

కిస్ ఆఫ్ లవ్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నవారు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారని హోం మంత్రి చెన్నితాల అన్నారు. ఇది కేవలం వారి స్వార్థ ప్రయోజనాలకోసం చేస్తున్నట్లుగా స్పష్టమౌతోందన్నారు. ఇటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పిన ఆయన... మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారందరినీ వ్యతిరేకులుగా నమ్మలేమన్నారు... మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా గతేడాది ఫేస్ బుక్ పేజ్లో కిస్ ఆఫ్ లవ్ ప్రారంభమైంది. అయితే దీన్ని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సహా పలు మతవాద, రాజకీయ బృందాలు అప్పట్లో వ్యతిరేకించాయి.

తాజాగా ఆన్ లైన్ వ్యభిచారం, మైనర్లతో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్కు సంబంధించిన కార్యకలాపాలపై దృష్టి సారించిన పోలీసులు బుధవారం 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాలను నిర్వహించిన రాహుల్ పసుపాలన్, అతని భార్య, రేష్మి ఆర్ నాయర్తోపాటు ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 'ఆపరేషన్ బిగ్ డాడీ' పేరుతో నిర్వహించిన తనిఖీల్లో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఎర్నాకులం రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. క్రైం బ్రాంచ్ ఇచ్చిన సమాచారం మేరకు రహస్యంగా దర్యాప్తు జరిపిన పోలీసు బృందాలు... మలప్పరం, త్రిసూర్, పాలక్కడ్ లలో ఏకకాలంలో దాడులు జరిపాయి. కొచ్చు సదరికల్ పేజీలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, కామెంట్స్ ను పరిశీలించి.. ఆపేజీలో ఉన్నవారంతా క్లైంట్స్ గా తేల్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను కూడ వీరు ట్రాప్ చేసి తెస్తున్నట్లుగా తేల్చి, గట్టి నిఘాతో నిందితులను ఆరెస్ట్ చేశారు.

కేరళ కొళికోడ్ లోని ఓ హోటల్ లో అనైతిక కార్యకలాపాలపై అప్పట్లో భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు దాడి జరపడంతో కొందరు ఫేస్ బుక్లో కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో పాల్గొనే వారు బహిరంగంగా ముద్దు పెట్టుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే అప్పట్లో కార్యక్రమం మొదలు కాకముందే పోలీసులు దాడిచేసి పాల్గొనేందుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. అయితే ప్రస్తుత సెక్స్ రాకెట్ కేసులో ఆ కార్యక్రమ నిర్వాహకులను కూడ పోలీసులు ప్రశ్నించడం కేరళలో చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు