ఆలస్యంగా వస్తే.. గవర్నరైనా అంతే!

23 Dec, 2015 14:53 IST|Sakshi
ఆలస్యంగా వస్తే.. గవర్నరైనా అంతే!

కేరళ గవర్నర్ పి.సదాశివానికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా వీఐపీలు, వీవీఐపీలు విమానాలు ఎక్కడానికి చిట్టచివరి నిమిషం వరకు రారు. మామూలు ప్రయాణికులను అయితే అలా అనుమతించరు. కానీ వీఐపీలకు మాత్రం ఆ వెసులుబాటు ఉండేది. అయితే కొచ్చి నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కాల్సిన కేరళ గవర్నర్.. విమానం టేకాఫ్ తీసుకోవాల్సిన చిట్టచివరి నిమిషం వరకు రాలేదు. దాంతో ఎయిరిండియా వర్గాలు ఆయనను అనుమతించలేదు. నిజానికి రాత్రి 9.20 గంటలకు బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం ఎఐ 048 రాత్రి 11.40 గంటల వరకు బయల్దేరలేదు. అంతసేపు ఆపినా.. గవర్నర్ మాత్రం 11.28 గంటలకు టర్మాక్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు నేరుగా అక్కడి నుంచే విమానం ఎక్కే అవకాశం ఉంది.

కానీ అప్పటికే విమానం టేకాఫ్ తీసుకోడానికి సిద్ధం కావడంతో.. నిచ్చెనను ఇవతలకు లాగేశారు. దాంతో గవర్నర్ విమానం ఎక్కడానికి వీలు కుదరలేదు. ఎయిరిండియాకు చెందిన ఓ అధికారి గవర్నర్ బోర్డింగ్ పాస్ పట్టుకుని ఉన్నా.. దాంతో ఎలాంటి ఉపయోగం కనిపించలేదు. గవర్నర్ సదాశివం కాసేపు అక్కడే ఉండి.. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు. త్రిసూర్‌లో అధికారిక కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వచ్చారని రాజ్‌భవన్ ఉద్యోగులు తెలిపారు. సాధారణంగా గవర్నరే విమానం ఎక్కే చివరి వ్యక్తి అవుతారని.. అయితే ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగి ఉంటుందని అన్నారు. 2014 ఏప్రిల్ వరకు సదాశివం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీ విరమణ చేసిన నాలుగునెలల తర్వాత ఆయన కేరళ గవర్నర్ అయ్యారు.

>
మరిన్ని వార్తలు