శబరిమలలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

1 Oct, 2018 16:06 IST|Sakshi

తిరువనంతపురం : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో శబరిమలలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కేరళ సర్కార్‌ చర్యలు చేపట్టింది. పంబా నదీతీరంలో మహిళల కోసం ప్రత్యేక ఘాట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు, మహిళలకు అనుకూలంగా ఉండేలా టాయ్‌లెట్ల నిర్మాణం వంటి పలు ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. హజ్‌ యాత్ర తర్వాత శబరిమల యాత్రనే ప్రపంచంలో రెండో అతిపెద్ద యాత్రగా పరిగణిస్తారు.

దశాబ్ధాలుగా శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం లేని క్రమంలో సర్వోన్నత న్యాయస్ధానం ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును మేథావులు, అభ్యుదయవాదులు స్వాగతించగా, సంప్రదాయాలు, ఆచారాలకు ఈ తీర్పు విరుద్ధమని హిందూ వర్గాలు మండిపడుతున్నాయి.

కాగా కోర్టు ఉత్తర్వులను అమలుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సారథ్యంలో మంత్రి దేవసోమ్‌ సురేంద్రన్‌, ఆలయ బోర్డు సభ్యులు, సీనియర్‌ పోలీస్‌ అధికారులు సమావేశమయ్యారు. మహిళా యాత్రికులు శబరిమల సందర్శించేలా తాము అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని సమావేశానంతరం మంత్రి సురేంద్రన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు