సీఏఏపై సుప్రీంను ఆశ్రయించిన కేరళ

14 Jan, 2020 10:22 IST|Sakshi

తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించింది పిటిషన్‌లో పేర్కొంది. రాజ్యాంగంలోని 14, 21, 24 అధికారణలకు ఈ చట్టం తీవ్ర విఘాతం కలిగిస్తోందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది. అలాగే దేశ లౌకికత్వాన్ని దెబ్బతీసే విధంగా చట్టం ఉందంటూ పేర్కొంది. ఈ మేరకు సీఏఏ చట్టాన్ని సవాలు చేస్తూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విధంగా సుప్రీంను ఆశ్రయించిన తొలి రాష్ట్ర ప్రభుత్వంగా కేరళ నిలిచింది.

కాగా దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ఇప్పటికే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. వివాదాస్పద చట్టాలు చెల్లుబాటు కావుంటూ.. పలువురు దాఖలు చేసిన పిటిషన్లను ఇదివరకే సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. అలాగే బీజేపీయేతర ముఖ్యమంత్రులకూ విజయన్‌ లేఖ రాశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వివాదాస్పద చట్టాలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. అలాగే అసెం‍బ్లీలో ప్రత్యేక తీర్మానం కూడా చేయాలని సూచించారు. కాగా సీఏఏకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇలా తీర్మానించిన తొలి రాష్ట్రంగా కూడా కేరళనే కావడం విశేషం.

>
మరిన్ని వార్తలు