రబ్బర్‌ స్టాంప్‌ను కాదన్న గవర్నర్‌..

16 Jan, 2020 15:35 IST|Sakshi

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యవహారంలో పినరయి విజయన్‌ సర్కార్‌పై గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని..అయితే రాజ్యాంగ అధిపతిగా తాను ఈ విషయం వార్తాపత్రికల్లో చూసి తెలుసుకున్నానని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం సరైంది కాదని..తాను కేవలం రబ్బర్‌ స్టాంప్‌ను కాదని రాష్ట్ర ప్రభుత్వంపై భగ్గుమన్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని, పాటించాల్సిన మర్యాదలను తుంగలో తొక్కిందని ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నర్‌ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చా అనే దానిపై తాను దృష్టిసారిస్తానని..ఇక్కడ అనుమతి ముఖ్యం కాదని..వారు (కేరళ ప్రభుత్వం) తనకు కనీస సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. మోదీ సర్కార్‌ పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సీఏఏను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన తొలి ప్రభుత్వంగా సీపీఎం నేతృత్వంలోని కేరళ సర్కార్‌ నిలవడం గమనార్హం. సీఏఏ చట్ట ముఖ్యోద్ధేశంలో పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మూడు దేశాలను ఒకే గాటన తీసుకురావడంలో హేతుబద్ధత లేదని తన పిటిషన్‌లో కేరళ అభ్యంతరం వ్యక్తం చేసింది.

చదవండి : సీఏఏపై సుప్రీం కోర్టు ఎలా విచారిస్తుంది?

>
మరిన్ని వార్తలు