కోడలికి పనులు చెప్పడం అసాధారణం కాదు: హైకోర్టు

30 May, 2020 21:06 IST|Sakshi

అతడి విడాకుల పిటిషన్‌ను స్వీకరిస్తున్నాం: కేరళ హైకోర్టు

తిరువనంతపురం: ఇంటి పనులు చేయమని కోడలికి చెప్పడం అసాధారణ విషయమేమీ కాదని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. వేరు కాపురం పెట్టాలని తనను వేధిస్తున్న భార్య నుంచి విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ వ్యక్తి పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ‘‘ఏ కుటుంబంలోనూ ఎల్లప్పుడూ కలతలే ఉండవు. కొన్నిసార్లు పెద్దవాళ్లు పిల్లలను తిట్టడం, దుర్భాషలాడటం సహజం. అంతేకాదు ఇంటి కోడలికి పనులు పురమాయించడం అసాధారణ విషయం కానే కాదు’’ అని ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

వివరాలు... కేరళకు చెందిన ఓ జంటకు 2003లో వివాహం జరిగింది. ఈ క్రమంలో వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. వీరి బంధానికి గుర్తుగా ఓ ఆడపిల్ల జన్మించింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ భార్యాభర్తలతో పాటుగా అత్తాకోడళ్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తల్లి నుంచి విడిపోయి తనతో వేరు కాపురం పెట్టాలంటూ సదరు భార్య భర్తను కోరింది. అయితే అందుకు ససేమిరా అనడంతో 2011లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు పిలిచినా ఆమె తిరిగి రాకపోడంతో.. విడాకులు కోరుతూ ఆమె భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

మానసికంగా, శారీరకంగా హింసించేది
ఈ క్రమంలో కోర్టుకు హాజరైన సదరు మహిళ.. తనకు విడాకులు తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. భర్తతో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, అతని తల్లి కారణంగానే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని న్యాయస్థానానికి విన్నవించింది. మానసికంగా, శారీరకంగా అత్త తనను హింసించేదని.. సర్జరీ జరిగినపుడు కుట్లు కూడా విప్పకముందే ఇంటి పని చేయాలంటూ ఒత్తిడి చేసేదని చెప్పుకొచ్చింది. తన భర్త, కూతురుతో వేరు కాపురం పెడితే అందరి సమస్యలు తీరిపోతాయంటూ కోర్టు ముందు ఆవేదన వెళ్లబోసుకుంది. ఈ క్రమంలో ఆమెకు అనుకూలంగా తీర్పునిస్తూ ఫ్యామిలీ కోర్టు 2014 జనవరిలో.. భర్త విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు.

ఆమె వల్లే మందుకు బానిసనయ్యా
ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు.. సదరు మహిళ చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది. ‘‘నా భార్య నన్ను అందరిముందు కుక్క అంటూ అవమానించేది. తన భర్తగా పనికిరానంటూ అసభ్యంగా మాట్లాడేది. బంధువుల ముందు నన్ను కొట్టేది. అంతేగాక శృంగారంలో పాల్గొనకుండా ఇబ్బంది పెట్టేది. తను చెప్పినట్లు చేయకపోతే చచ్చిపోతానని బెదిరించేది. నిజానికి నాకు మొదట్లో తాగుడు అలవాటు లేదు. కానీ ఆమె వల్లే నేను మందుకు బానిసగా మారాను’’ అంటూ సదరు వ్యక్తి పిటిషన్‌లో పేర్కొన్న వివరాలను బట్టి అతడు ఆమెతో సంతోషంగా ఉండలేడని పేర్కొంటూ విడాకుల పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. అంతేగాక సదరు మహిళ చెబుతున్నట్లుగా.. ఇందులో ఆమె అత్త ప్రమేయమేమీ లేదని .. కోడలే కావాలని గొడవకు దిగేదని సాక్ష్యాధారాలను బట్టి నిరూపితమైందని తెలిపింది. వీరిద్దరి మధ్య అతడు నలిగిపోయాడని.. ఇకపై అతడు టార్చర్‌ అనుభవించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

>
మరిన్ని వార్తలు