రాత్రికి రాత్రే కేరళ కూలీకి రూ. 12కోట్లు..!

12 Feb, 2020 17:20 IST|Sakshi

తిరువనంతపురం: అతడో రోజువారీ కూలీ. రెక్కాడితేకానీ డొక్కాడని పరిస్థితి అతని కుటుంబానిది. అలాంటి వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఘటన కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాలో చోటుచేసుకుంది. పేరూన్నోన్‌ రాజన్‌ అనే వ్యక్తి రోజూవారీ కూలీ పనులకు వెళ్తూ.. జీవనాన్ని సాగించేవాడు. అప్పులపాలైన అతడు చాలీచాలని కూలీ డబ్బులతోనే తన కుటుంబాన్ని నెట్టుకొస్తుండేవాడు. అతడి భార్య రజనీ స్థానిక అంగన్‌వాడీలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తోంది. రాజన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే తాను పడుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఏ రోజైనా అదృష్టం తలుపు తట్టదా అనే ఆశతో రోజూ లాటరీ టికెట్లు కొంటుండేవాడు. 
చదవండి:  ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఐదు శవాలు

అలా తాజాగా రాజన్ కొన్న లాటరీ టికెట్టుకు కేరళ క్రిస్టమస్ బంపర్ లాటరీ పేరిట రూ.12కోట్లు దక్కాయి. తనకు బంపర్ లాటరీ లభించిందని తెలుసుకున్న రాజన్ షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడు గెలిచిన ఆ టికెట్‌తో స్థానిక కోఆపరేటీవ్ బ్యాంకు వద్దకు వెళ్లి అధికారికంగా అందజేశాడు. ఇప్పటికే ఆ బ్యాంకులో ఇంటిపై అతను అప్పు చేశాడు. ప్రైజ్ మనీ రాగానే  ముందుగా ఈ లాటరీ డబ్బులతో తనకున్న అప్పులు తీరుస్తానని రాజన్ చెప్పారు. తన చిన్న కూతురిని బాగా చదివించాలని చూస్తున్నట్లు చెప్పారు. రూ.12 కోట్ల లాటరీకి గాను పన్నులు పోను తనకు రూ.7.2 కోట్లు వస్తాయని, ఆ డబ్బుతో తనకు గతంలో సహాయపడిన వారికి సాయం చేస్తానని రాజన్ చెప్పారు. చెమట చిందించి సంపాదించే తనకు డబ్బు విలువ తెలుసునని, అందుకే ఈ లాటరీ డబ్బును వృథా చేయనని రాజన్ వివరించారు. రాజన్‌కు భార్య రజని, ఇద్దరు కుమార్తెలు అక్షర, అథిర, కుమారుడు రిగిల్ ఉన్నారు.  
చదవండి: వేరుశెనక్కాయల్లో డబ్బులే డబ్బులు

మరిన్ని వార్తలు