తమిళనాడుకు హదియా

28 Nov, 2017 03:18 IST|Sakshi

చదువుకునేందుకు పంపాలని ‘లవ్‌జిహాదీ’ కేసులో సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: ఇస్లాం మతం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్‌ జహాన్‌ను పెళ్లాడిన కేరళ యువతి హదియాను సుప్రీంకోర్టు తమిళనాడులోని సేలం జిల్లాకు పంపింది. ఆమె తన హోమియోపతి చదువును పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ‘లవ్‌జిహాద్‌’ కేసుకు సంబంధించి సోమవారం హదియా కోర్టుకు హాజరైంది. తన భర్త షఫీన్‌ జహాన్‌తోనే ఉంటానని కోర్టుకు హదియా స్పష్టం చేసింది. హదియా, జహాన్‌ల పెళ్లిని ‘లవ్‌ జిహాద్‌’గా అభివర్ణించిన కేరళ హైకోర్టు.. వారి వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఉత్తర్వులను సవాలు చేస్తూ జహాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. హదియా చదువుతున్న కాలేజీ డీన్‌ను ఆమెకు సంరక్షకుడిగా నియమించిన అత్యున్నత ధర్మాసనం.. ఏదైనా సమస్య ఎదురైతే తమను సంప్రదించే స్వేచ్ఛను డీన్‌కు ఇచ్చింది. హదియాకు మళ్లీ అడ్మిషన్‌ ఇవ్వాలని, హాస్టల్‌ సదుపాయాలు కల్పించాలని సంబంధిత కాలేజీ, వర్సిటీని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌ల బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

భార్య చరాస్తి కాదు..
హదియా చదువు, అలవాట్లు, ఆమె జీవితాశయం గురించి ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. సేలంలో తన సంరక్షకుడిగా ఉండేందుకు ఎవరైనా బంధువులు లేదా పరిచయస్తుల పేర్లు తెలపాల్సిందిగా ధర్మాసనం కోరగా.. తన భర్త షఫీన్‌ సంరక్షకుడిగా ఉంటారని ఆమె జవాబిచ్చింది. దీనిపై జస్టిస్‌  చంద్రచూడ్‌ స్పందిస్తూ.. ‘ఓ భర్త తన భార్యకు సంరక్షకుడిగా ఉండలేడు. భార్య చరాస్తి కాదు. ఆమెకు వ్యక్తిగత గుర్తింపు, జీవితం ఉంటాయి. నేను కూడా నా భార్యకు సంరక్షకుడిని కాదు’ అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు