‍కరోనా నెగటివ్‌ ఐతే.. అంతకన్నా విషాదం ఉండదు!

14 Mar, 2020 09:36 IST|Sakshi
మాస్కుతో లినో ఏబెల్‌, పక్కన తండ్రి ఫొటో(ఫేస్‌బుక్‌ ఫొటోలు)

ఖతార్‌ నుంచి వచ్చిన కేరళ వ్యక్తి

కరోనా భయంతో ఐసోలేషన్‌ వార్డులో ఉండిపోయిన వైనం

తిరువనంతపురం: ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడుతుండగా.. లక్షలాది మంది దాని లక్షణాలతో వేదన అనుభవిస్తున్నారు. మరికొంత మంది ఈ మహమ్మారి కారణంగా తమ వాళ్లను కోల్పోయి.. హృదయవిదారకంగా విలపిస్తున్నారు. కరోనా మరణాలకు సంబంధించిన కథనాలు ఎన్నో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ వ్యక్తి తను కరోనా నెగటివ్‌ అని తేలితే.. తన విషాదం మరింత రెట్టింపు అవుతుందని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. అతడు ఇలా అనడానికి గల కారణం తెలిస్తే కళ్లు చెమర్చకమానవు.

వివరాలు.. కేరళలోని తోడుపుళకు చెందిన లినో ఏబెల్‌ ఖతార్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్వస్థలంలో నివసించే అతడి తండ్రి మంచం మీద నుంచి పడిపోయిన కారణంగా తీవ్ర గాయాలపాలయ్యాడని మార్చి 7న అతడికి ఫోన్‌ వచ్చింది. దీంతో వెంటనే కేరళకు టికెట్లు బుక్‌చేసుకుని.. కొట్టాయంలో తండ్రి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో కరోనా టెస్టులు పూర్తైన వైరస్‌ లక్షణాలు లేవని తేలడంతో సరాసరి తండ్రి దగ్గరకు వెళ్లాడు. అయితే ప్రాణాంతక వైరస్‌ భయం వెంటాడంతో తన తండ్రి, బంధువులతో నేరుగా మాట్లాడలేకపోయాడు.(ఇక్కడే పడి ఉంది.. నా సోదరి శవాన్ని తీసుకెళ్లండి)

ఈ నేపథ్యంలో దూరం నుంచే తండ్రిని చూసిన ఏబెల్‌ ఆస్పత్రి నుంచి బయటకు రాగానే దగ్గు, గొంతు నొప్పి ప్రారంభమైంది. అయితే దీనిని తొలుత తేలిగ్గా తీసుకున్న అతడు.. ముందు జాగ్రత్త చర్యగా అక్కడి డాక్టర్లను సంప్రదించాడు. ఖతార్‌, కేరళలో కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో అతడిని ఐసోలేషన్‌ వార్డులో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. అందరి ఆరోగ్యం దృష్ట్యా ఏబెల్‌ ఇందుకు అంగీకరించాడు. అయితే ఐసోలేషన్‌ వార్డులో ఉన్న సమయంలోనే తండ్రి మరణించాడనే వార్త అతడికి తెలిసింది. కానీ ఐసోలేషన్‌ ప్రొటోకాల్‌ దృష్ట్యా తండ్రి శవాన్ని కూడా చూసే వీల్లేకుండా పోయింది. దీంతో ఆస్పత్రి కిటికిలో నుంచే అంబులెన్సులో తీసుకువెళ్తున్న తండ్రి భౌతికకాయాన్ని చూసి అతడు విలపించాడు. (భారత్‌లో రెండో మరణం)

ఈ విషయం గురించి చెబుతూ.. ‘‘మా నాన్న శవాన్ని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత వీడియో కాల్‌లో తనను కడసారి చూసుకున్నాను. కరోనా భయం లేకపోయి ఉంటే నేనక్కడ తనతో పాటే ఉండేవాడిని. కానీ నా కారణంగా ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తి చెందకూడదన్న నిర్ణయంతో ఆస్పత్రిలోనే ఉండిపోయాను. నా కుటుంబ సభ్యులు, బంధువులు, నా ప్రాంత ప్రజల గురించి ఆలోచించి ఆ అవకాశాన్ని వదులుకున్నాను. అయితే ఇప్పుడు నేను కరోనా వైరస్‌ నెగటివ్‌గా తేలితే ఇంతకన్నా విషాదం మరొకటి ఉండదు’’అని ఏబెల్‌ తండ్రిపై ప్రేమతో పాటుగా సమాజం పట్ల బాధ్యతను చాటుకున్నాడు. అదేవిధంగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు దాదాపు రెండు రోజులు ఐసోలేషన్‌ వార్డులో ఉంటే జీవితాంతం కుటుంబంతో కలిసి ఉండవచ్చని ఏబెల్‌ స్ఫూర్తి నింపాడు. ప్రస్తుతం అతడిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా శుక్రవారం నాటి తన ప్రసంగంలో అతడి ధైర్యం, త్యాగం గురించి ప్రస్తావించారు. కాగా దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన విషయం తెలిసిందే. ఇక భారత్‌లో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది. దేశవ్యాప్తంగా 82 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు