వైరస్‌ లక్షణాలు బయటపడలేదు.. మూలం తెలియలేదు

18 Jun, 2020 18:06 IST|Sakshi
కరోనాతో మృతి చెందిన కేరళ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ డ్రైవర్‌ సునీల్‌ కుమార్‌

తిరువనంతపురం: గురువారం ఉదయం కేరళలోని కన్నూర్ జిల్లాలో ఎక్సైజ్ విభాగంలో పనిచేస్తున్న 28 ఏళ్ల డ్రైవర్ కరోనాతో మరణించాడు. అయితే చనిపోయే ముందు వరకు అతడిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడమే కాక..  ఎక్కడ, ఎవరి ద్వారా అతడికి కరోనా సోకింది అనే విషయం ఇంకా తెలియలేదు. ఇప్పటివరకు సమాజంలో వైరస్ నిశ్శబ్దంగా సంక్రమిస్తుందనే సందేహాలను  పక్కదారి పట్టించిన కేరళలో నమోదయిన ఈ కేసు.. ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులకు కొత్త సవాలు విసురుతోంది. వివరాలు  

పాడియూర్‌కు చెందిన సునీల్‌ కుమార్‌ మత్తన్నూర్ ఎక్సైజ్ రేంజ్ కార్యాలయంలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 12న అతడు వైరల్ న్యుమోనియా లక్షణాలతో మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు కానీ ఫలితం లేదు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో జిల్లాలో కరోనా పేషంట్లకు చికిత్స అందించే అత్యున్నత ఆస్పత్రి పరియారం మెడికల్ కాలేజీకి పంపించారు. అక్కడ అతనికి కరోనా పరీక్షలు చేశారు. జూన్‌ 14న నమునాలు తీసుకోగా.. దాని ఫలితాలు జూన్ 16న  వచ్చాయి. సునీల్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే అతడికి వైరస్‌ సంక్రమణ ఎలా జరిగింది అనే విషయం ఇంకా తెలియలేదు. (వైద్యులకు, పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వండి)

ఈ క్రమంలో వైద్యులు మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఉదయం 9:55 గంటలకు సునీల్‌ కుమార్‌ మరణించాడు. తొలుత అతడిలో కరోనా లక్షణాలు కనిపించలేదు. అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌ వచ్చింది’ అన్నారు. ‘సునీల్‌ కుమార్‌ డ్రైవర్‌ కావడంతో సహజంగానే అతను చాలా ప్రదేశాలకు వెళ్లి ఉంటాడు. ప్రైమరి కాంటాక్ట్స్‌ చాలానే ఉండే అవకాశం ఉంది. అంతేకాక ఎక్సైజ్ కార్యాలయంలో అతని సహచరులతో పాటు బయట అతను కలుసుకున్న ఇతరుల వివారలు సేకరిస్తున్నాం. అయితే సునీల్‌ కుమార్‌కి‌ ఎక్కడ, ఎవరి నుంచి కరోనా సోకింది అనే దాని గురించి తెలుసుకోవడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాము’ అన్నారు.

డాక్టర్ నాయక్ మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి శరీరంలో అతని / ఆమె రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే.. వేరే ఇతర అంతర్గత వైద్య పరిస్థితులతో సంబంధం లేకుండా వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది’ అన్నారు. అంతేకాక ‘ఇది క్లిష్టమైన పరిస్థితి. వైరస్ ప్రజలను ఎక్కడ, ఎలా ప్రభావితం చేస్తుందో మేము చెప్పలేము. ఇప్పటివరకు కన్నూర్ జిల్లాలో కరోనా కారణంగా కేవలం​ వృద్ధులు మాత్రమే మరణించారు. వారిలో మొదటి నుంచి కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ సునీల్‌ కుమార్‌ విషయంలో ఇవేవి జరగలేదు. మేము చాలా జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు

కరోనా కారణంగా కేరళలో మృతి చెందిన వారిలో సునీల్ కుమార్ 21వ వ్యక్తి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కరోనా లక్షణాలు కనిపపించకుండా మరణించిన రెండవ వ్యక్తి సునీల్‌ కుమార్‌. మే 31 న కొల్లం జిల్లాలో 65 ఏళ్ల వ్యక్తి మరణించిన కేసులో కూడా మొదట కరోనా లక్షణాల కనిపించలేదు. వైరస్‌ ఎక్కడి నుంచి సంక్రమించింది అనే విషయం ఇప్పటికి కూడా తెలియలేదు.

మరిన్ని వార్తలు