బాహుబలిలా మూటలు మోసిన మంత్రి

28 Aug, 2018 17:15 IST|Sakshi

తిరువనంతపురం: ప్రకృతి సృష్టించిన విలయం నుంచి కేరళ ప్రజలను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి కేంద్రబలగాలతో పాటు, ఉన్నతాధికారులు కూడా శ్రమించారు. మత్య్సకారులైతే స్వచ్ఛందగా తమ సేవలందించారు. ఇలా ప్రతి ఒక్కరు ఏదోరకంగా తమకు తోచిన సహాయం చేశారు. కేరళ వరద బాధితులకు సహాయక సామాగ్రిని అందజేయడానికి ఐఏఎస్‌ అధికారులు సైతం మూటలు మోసిన సంగతి విదితమే.

సహాయక చర్యల్లో కేరళ మంత్రి రవీంద్రనాథ్‌ వ్యవహరించిన తీరు పలువురికి ఆదర్శంగా నిలిచింది. కేవలం సహాయక చర్యలను పర్యవేక్షించడమే కాకుండా.. బాధితులకు కావాల్సిన సామాగ్రిని ఆయన తన భుజంపై మోసారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే.. ఆయన బాహుబలిలా కష్టపడ్డారని అభినందిస్తున్నారు.

కాగా కేరళలో సంభవించిన వరదల్లో చిక్కుకుని 400 మందికి పైగా మరణించగా, వేలాదిమందిని సైన్యం, సహాయక బృందాలు కాపాడాయి. ప్రకృతి విపత్తు కారణంగా కేరళ 21 వేల కోట్లు నష్టపోయిందని అంచనా వేస్తున్నారు.


మరిన్ని వార్తలు