మంత్రి రాజీనామా.. అంతలోనే తూచ్!

30 Jan, 2016 21:31 IST|Sakshi
మంత్రి రాజీనామా.. అంతలోనే తూచ్!

తిరువనంతపురం: కేరళను కుదిపేస్తున్న బార్ స్కాం, సోలార్ స్కాం పలు మలుపులు తిరుగుతున్నాయి. బార్లకు అనుమతి ఇచ్చేందుకు రూ. 50 లక్షల లంచం తీసుకున్నారన్న కేసులో కోర్టు విచారణకు ఆదేశించడంతో ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె. బాబు రాజీనామా చేశారు. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంతోని యూడీఎఫ్ నేతల నుంచి ఒత్తిడి రావడంతో రాజీనామాను అంతలోనే ఉపసంహరించుకున్నారు. అయితే ఇదంతా సీఎం ఊమెన్ చాందీ పక్కాగా రచించిన స్క్రిప్టు ప్రకారమే జరిగిందని విపక్ష సీపీఐ-ఎం ఆరోపించింది.

బార్ ఓనర్ల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో గతంలో ఆర్థికమంత్రి కేఎం మణి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనకు కూడా కోర్టులో ఊరట లభించడంతో తిరిగి పదవి చేపట్టాలని యూడీఎఫ్ వర్గాలు అంటున్నా, తాను మళ్లీ వచ్చేందుకు తొందరేమీ లేదని మణి అంటున్నారు. మంత్రి పదవి చేపట్టాలని కోరిన యూడీఎఫ్కు కృతఙ్ఞతలు తెలిపిన ఆయన ఈ అంశంపై పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని శనివారం తెలిపారు.

అయితే ఈ ఇద్దరు నేతలకు హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వలేదని, కేవలం కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు నెలలు స్టే మాత్రమే విధించిందని సీపీఐ-ఎం నేత కొడియేరి బాలకృష్ణన్ తెలిపారు. హైకోర్టు ఈ కుంభకోణంలో వాదనలు కూడా వినబోతున్న నేపథ్యంలో అప్పుడే క్లీన్చిట్ దొరికిందని నేతలు చెప్పడం ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పక్కాగా నడిపిస్తున్న డ్రామాగా అభివర్ణించారు.
 

మరిన్ని వార్తలు