‘మీరంతా ప్రభాస్‌ని చూసి నేర్చుకొండి’

4 Sep, 2018 13:38 IST|Sakshi

తిరువనంతపురం : ‘మీరంతా ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని విన్నాను. అంత సంపాదిస్తున్న మీరు కేరళ ప్రజలను ఆదుకోవడానకి చాలా తక్కువ మొత్తం సాయం చేశారు. మీకంటే తెలుగు హీరో ప్రభాస్‌ నయం. అతన్ని చూసి నేర్చుకొండి’ అంటూ కేరళ పర్యటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ మలయాళ నటులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుండపోత వర్షాలు, వరదల కారణంగా కేరళ అతాలకుతలమయిన సంగతి తెలిసిందే. వరద బాధితుల సంరక్షణ నిమిత్తం సోమవారం కేరళ ప్రభుత్వం ‘కేర్‌ కేరళ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమాని​కి హాజరైన సురేంద్రన్‌ మాట్లాడుతూ ‘మన రాష్ట్రంలో ఎందరో సూపర్‌స్టార్లు ఉన్నారు. వారు ప్రతీ సినిమాకు 4 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటారని విన్నాను. అంత సంపాదించే వారు వరద బాధితులకు చాలా తక్కువ మొత్తంలో సాయం చేశారు. మీలాంటి వారంతా ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. ఆయన ఇంతవరకూ మలయాళ సినిమాల్లో నటించింది లేదు. అయినప్పటికీ కేరళ వరదల గురించి తెలిసిన వెంటనే సాయం చేయడానికి ముందుకొచ్చి.. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారంటా’ అంటూ సురేంద్రన్ మలయాళ నటులపై మండిపడ్డారు ‌. మలయాళ నటులకంటే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలే ఎక్కువ నగదు సాయం చేశారని సురేంద్రన్‌ అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి ప్రభాస్‌ కేరళ వరద బాధితులకు సాయం చేసింది కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే. ఈ విషయం సదరు మంత్రి గారికి తెలియకపోవడంతో ప్రభాస్‌ని చూసి నేర్చుకొండి అంటూ వ్యాఖ్యానించారు.

అయితే కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆర్థికంగా సాయం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఇటీవల కమల్‌హాసన్‌, మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌, అనుపమ పరమేశ్వరన్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ సేతుపతి, సిద్ధార్థ్‌, ధనుష్‌, రజనీకాంత్‌, శివకార్తికేయ, నయనతార, విశాల్‌, విక్రమ్‌, విజయ్‌ దేవరకొండ, నాగార్జున తదితరులు కేరళ కోసం తమవంతు సాయం చేశారు.

మరిన్ని వార్తలు