ఆమె కోలుకుంది

7 Apr, 2020 10:53 IST|Sakshi

కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన వృద్ధదంపతులు థామస్, మరియమ్మలు కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే కదా! వాళ్లకు వైద్య సేవలు అందించిన రేష్మ మోహన్‌దాస్‌ అనే నర్స్‌కూ కరోనా సోకింది. కేరళలో ఆ వైరస్‌ బారిన పడ్డ తొలి హెల్త్‌ వర్కర్‌ రేష్మ. ఇప్పుడు శుభవార్త ఏంటంటే ఆమె కోలుకొని ఆరోగ్యవంతురాలై ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్‌ అయింది. డాక్టర్లు, తోటి నర్సుల అభినందనల మధ్య ఆమె ఇంటికి బయలుదేరారు. ‘14 రోజుల క్వారంటైన్‌ తర్వాత రేష్మ తిరిగి విధులకు హాజరు కావచ్చు’ అని కేరళఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. (కరోనాపై గెలుపు: అపూర్వ వీడ్కోలు)

అయితే రేష్మ చాలా తేలికపాటి లక్షణాలతోనే బాధపడిందని అంతే త్వరగా కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి. ‘కరోనా ట్రీట్‌మెంట్‌కు మా ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. దీనిపట్ల ఎలాంటి భయాందోళనలు, అనుమానాలు అక్కర్లేదు. కరోనాను నిరోధించడంలో కేరళ తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని ధైర్యం ఇస్తోంది రేష్మ.  డాక్టర్లు, నర్సులే కాదు భర్త ఉన్నికృష్ణన్, తల్లి ఇచ్చిన మనోధైర్యం కూడా తనకు ఔషధంలా పనిచేశాయి అంటోంది రేష్మ. (కేరళలో అద్భుతం: వారు కోలుకున్నారు!)

>
మరిన్ని వార్తలు