కరోనా బారిన కేరళ నర్స్‌

24 Jan, 2020 04:38 IST|Sakshi
కరోనా వైరస్‌ భయంతో హాంకాంగ్‌లోని రైల్వే స్టేషన్‌ వద్ద మాస్కులు ధరించిన ప్రయాణికులు

సౌదీలో గుర్తించిన అధికారులు

చికిత్స అందిస్తున్న వైద్యులు

న్యూఢిల్లీ/తిరువనంతపురం: సౌదీ అరేబియాలోని ఒక ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న కేరళ యువతికి ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకింది. ఆమెను సౌదీలోని అసీర్‌ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ‘అల్‌ హయత్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న దాదాపు 100 మంది భారతీయ నర్సులను పరీక్షించగా..ఒక నర్సుకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆ నర్స్‌ ప్రస్తుతం కోలుకుంటోంది’ అని భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్‌ గురువారం ట్వీట్‌ చేశారు.

మిగతా నర్సుల్లో అత్యధికులు కేరళవారేనని, వారిలో ఎవరికీ ఈ వైరస్‌ సోకలేదని, సౌదీ విదేశాంగ శాఖతో జెడ్డాలోని భారతీయ రాయబారి సంప్రదిస్తున్నారని మురళీధరన్‌ పేర్కొన్నారు. ఆ నర్స్‌ది కొట్టాయం జిల్లాలోని ఎట్టుమన్నూర్‌ అని సమాచారం. కరోనా వైరస్‌ సోకిన తమ రాష్ట్రం వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మిగతావారికి ఈ వైరస్‌ సోకకుండా జాగ్రత్త వహించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌కు లేఖ రాశారు. బుధవారం వరకు మొత్తం 60 విమానాల్లో వచ్చిన దాదాపు 13 వేల మంది ప్రయాణీకులను పరీక్షించామని, ఎవరిలోనూ వైరస్‌ను గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపింది.

చైనాలో 630 కేసులు
చైనాలో దాదాపు 630 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. 17 మంది చనిపోయారు. ఈ వైరస్‌ను మొదట గుర్తించిన వుహాన్‌ సహా ఐదు నగరాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు.
 

>
మరిన్ని వార్తలు