కేరళ వరదలు: మాది ప్రత్యేక బాధ్యత

18 Aug, 2018 15:33 IST|Sakshi

వరద విపత్తుతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) ముందుకు వచ్చింది. రాష్ట్రంలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లోని బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సమాయత్తమవుతోంది.  వారిని ఆదుకునేందుకు ఒక నేషనల్‌ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వరదలతో ఇబ్బందులు పడుతున్న కేరళ ప్రజలకు సహాయం అందించేందుకు జాతీయ అత్యవసర కమిటీని ఏర్పాటు చేయాలని యుఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా ఆదేశించారు. 

యుఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం మాట్లాడుతూ  భారీగా వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయపడేందుకు, వారికి ఆపన్నహస్తం అందివ్వాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై వుందని వ్యాఖ్యానించారు. యుఏఈ సక్సెస్‌ స్టోరీలో కేరళ ప్రజల భాగస్వామ్యం  కీలకమైందని వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. కేరళ ప్రజలకు సాయం చేసేందుకు బిజినెస్‌ లీడర్లు, ప్రజా సంఘాలు, కార్యకర్తలతో ఆదివారం చర్చించనున‍్నట్టు  భారతదేశంలో యూఏఈ రాయబారి, నవదీప్ సింగ్ సూరి చెప్పారు.  ఈ  సంక్షోభ సమయంలో ప్రజలందరూ భారీగా విరాళాలివ్వాలని ఆయన ట్విటర్‌ ద్వారా కోరారు. దీంతోపాటు ముఖ్యమంత్రి సహాయనిధికి   సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేరళ సీఎంవో  చేసిన ట్వీట్‌  యుఏఈ రాయబార కార్యాలయం రీ ట్వీట్‌ చేసింది.

గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని వరద పరిస్థితి కేరళను అతలాకుతలం చేస్తోంది. గత పదిరోజులుగా దయనీయమైన, అధ్వాన్నమై వాతావరణం  అక్కడి ప్రజలను బాధిస్తోంది. దాదాపు 13జిల్లాల్లో ఇంకా రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనం. దాదాపు100 డ్యాములు, రిజర్వాయర్లు, నదులు మునిగిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 26వరకు  కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. సహాయక శిబిరాల్లో   ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికి 324 మంది మృతి చెందగా 3లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా యుఏఈలో పనిచేస్తున్న అనేకమంది  ఉద్యోగులు  కేరళకు చెందిన వారే.

మరిన్ని వార్తలు