కేరళ ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రశంసలు

1 Jun, 2020 17:35 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర జల రవాణా శాఖ (ఎస్‌డబ్ల్యూటీడీ)కు చెందిన 70 సీట్ల పడవ కేవలం ఒక ప్రయాణీకురాలి కోసం అలప్పుజ జిల్లాలోని ఎంఎన్ బ్లాక్ నుంచి కొట్టాయంలోని కంజిరామ్‌ బయలుదేరింది. ఓ విద్యార్థినిని హెచ్‌ఎస్‌సీ (ప్లస్ వన్) పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం కోసం కేరళ ప్రభుత్వం ఏకంగా ఓ బోటునే ఏర్పాటు చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయమే. ఆ వివరాలు.. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయా రాష్టాలు పరీక్షల తేదీలను వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కేరళలో ప్లస్‌ వన్‌ పరీక్షలు జరుగుతున్నాయి. సాండ్ర బాబు(17) అనే విద్యార్థిని పరీక్షలకు హాజరు కావాలి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా కుట్టనాడ్‌ ప్రాంతంలో ప్యాసింజర్‌ బోట్లు నిలిపివేశారు. దాంతో ఏం చేయాలో పాలుపోని విద్యార్థిని ఎస్‌డబ్ల్యూటీడీ అధికారులకు సమాచారం అందించింది. (ఇప్పుడే ముప్పెక్కువ)

సాండ్రా బాబు పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు ఆమె కోసం బోటు పంపిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం విద్యార్థినిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం కోసం పూర్తి అనుభవజ్ఞులైన ఐదుగురు సిబ్బందితో, 70 సీట్ల బోటును పంపించారు అధికారులు. ప్రతి రోజు సాండ్ర ఇంటి దగ్గర ఉన్న జెట్టీ నుంచి ఉదయం 11.30 గంటలకు బోటు బయలుదేరుతుంది. కంజీవరంలోని ఎస్‌ఎన్‌డీపీ హైయ్యర్‌ సెకండరీ స్కూల్‌ దగ్గర ఉన్న జెట్టీ వద్ద దింపుతుంది. ఆమె పరీక్ష అయిపోయేంత వరకు అక్కడే ఉండి తర్వాత విద్యార్థినిని ఇంటి దగ్గర వదులుతుంది. ఈ క్రమంలో సాండ్ర మాట్లాడుతూ.. ‘పాఠశాలకు చేరడానికి నాకు వేరే మార్గం లేదు. బోటు నడవకపోతే నేను పరీక్షలు రాయడం కుదరదు. దాంతో నేను ఎస్‌డబ్ల్యూటీడీ అధికారులకు నా పరిస్థితి గురించి తెలియజేశాను. వారు నా కోసం బోటు నడుపుతున్నారు. నేను ఎస్‌డబ్ల్యూటీడీ అధి​కారుల మేలు ఎప్పటికి మరవలేను. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను’ అన్నది. (నిర్లక్ష్యం వద్దు.. యుద్ధం ముగియలేదు!)

ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యూటీడీ డైరెక్టర్ షాజీ వి నాయర్ మాట్లాడుతూ.. ‘సాండ్రా సహాయం కోరినప్పుడు అధికారులు మరో ఆలోచనకు తావియ్యలేదు. వెంటనే స్థానిక మంత్రిని కలిసి సమస్యను వివరించారు. బోటును నడపడానికి ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు