రెండు లక్షల నజరానా.. అదుపులోకి ఓ వ్యక్తి

4 Jun, 2020 16:32 IST|Sakshi

రెండు లక్షల నగదు ప్రకటించిన హైదరాబాద్‌ వాసి

తిరువనంతపురం : కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుని చంపిన ఘటన దేశంలోని జంతు ప్రేమికులను అందరినీ కదిలించింది. మనిషి ఇంత అరాచకానికి దిగజారుతాడా అనే ఆలోచనలు అందరిలోనూ కలిగించింది. లాక్‌డౌన్ సమయంలో ఆహారం లేక అలమటిస్తున్న మూగ జీవాలకు సొంత గ్యారేజ్‌లో ఆహారం తయారు చేసి పంపిణీ చేసే వారు ఓ వైపు ఉండగా, మరోవైపు పేలుడు పదార్ధాలు పెట్టి జంతువులకు తినిపించే మానవ మృగాలు కూడా ఇదే సమాజంలో ఉన్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో ఏనుగుని చంపిన ఘటనపై హైదరాబాద్‌లోని నెరేడ్‌మెట్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి స్పందించారు. ఏనుగుని హతమార్చిన వారి ఆచూకీ తెలిపితే రెండు లక్షలు నగదు అందజేస్తామని ప్రకటించారు. (ఏనుగు నోట్లో పైనాపిల్‌ బాంబ్‌)

ఈ క్రమంలోనే ఘటనపై ప్రశ్నించేందుకు పోలీసులు స్థానిక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మొదట అతని నిరాకరించినప్పటికీ కేవలం విచారణ మాత్రమే చేస్తామని నచ్చచెప్పి తీసుకెళ్లారు. ఘటనతో అతనికి ఏమైనా సంబంధం ఉందా? లేక నిందితులు ఎవరో అతనికి తెలుసా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఏనుగు మృతికి కారణమైన మృగాలను వీలైనంత త్వరగా గుర్తించాలని  రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖను ఆదేశించింది. నిందితులు ఎవరైనా సరే కఠినశిక్ష నుంచి తప్పించుకోలేరని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. వారి కోసం ఇప్పటికే పలు బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. (‘ఇలా చేయడం మన సంస్కృతి కాదు’)

>
మరిన్ని వార్తలు