ఏడాదిగా ఐసిస్‌ చెరలో.. నేడు భారత్‌కు..

12 Sep, 2017 16:45 IST|Sakshi
ఏడాదిగా ఐసిస్‌ చెరలో.. నేడు భారత్‌కు..

సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు ఏడాదిపాటు ఉగ్రవాదుల చేతిలో బందీగా ఉన్న కేరళకు చెందిన క్రైస్తవ మత ప్రబోధకుడు ఫాదర్‌ టామ్‌ ఉజున్నాలిల్‌ ఎట్టకేలకు బయటపడ్డారు. ఆయన మంగళవారం రాత్రిలోగా కేరళకు చేరుకుంటారని కేంద్ర విదేశాంగ వర్గాల సమాచారం తెలిపింది. ఫాదర్‌ టామ్‌ను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు 2016 మార్చి నెలలో యెమెన్‌లోని అడెన్‌లో మదర్‌ థెరిసా మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంపై దాడి చేసి ఎత్తుకెళ్లారు.

ఆ దాడిలో దాదాపు 15మంది ప్రాణాలు కోల్పోయారు. ఫాదర్‌ టామ్‌ను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లడం కేరళలో పెద్ద కలకలమే రేపింది. యెమెన్‌లో భారత్‌కు రాయబార కార్యాలయం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని వివిధ దేశాలను సంప్రదించడం ద్వారా యెమెన్‌కు దగ్గరవడంతో అక్కడి అధికారులు, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ పరస్పర సమన్వయంతో తిరిగి ఆయనను భద్రంగా ఉగ్రవాదుల చెర నుంచి విడిపించగలిగారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్‌ 'ఫాదర్‌ టామ్‌ సురక్షితంగా బయటపడ్డారనే విషయాన్ని వెల్లడిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది' అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు