తినడానికి డబ్బుల్లేవా.. ఆ రెస్టారెంట్‌లో ఫ్రీ

5 Mar, 2018 16:41 IST|Sakshi

తిరువనంతపురం : ఆదివాసి యువకుడు మధు హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  కేవలం బియ్యం దొంగలించినందుకు ఒక గుంపు ఎగబడి ఆ యువకుడిని(27) దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. మతిస్థిమితం లేని ఆ ఆదివాసీ కొడుతూ... ఆ సమయంలో సెల్ఫీ, సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. 

ఈ ఘటన తర్వాత కేరళ ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఆకలి చావుల రహిత రాష్ట్రంగా కేరళను తీర్చి దిద్దేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలో అలప్పుఝా జిల్లాలో క్యాష్‌ కౌంటర్‌ లెస్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. జనకీయ భక్షణశాల పేరుతో స్నేహజలకమ్‌ అనే ఎన్జీవో సంస్థ ప్రజలకు ఉచితంగా భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది. శనివారం ఈ రెస్టారెంట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ ప్రారంభించారు. ‘మధులా మరెవరూ బలి కాకూడదు. అందుకే ప్రభుత్వ ప్రోత్సాహకంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాం’ స్నేహజలకమ్‌ కన్వీనర్‌ వెల్లడించారు.

ఆకలితో ఉండి.. జేబులో డబ్బులు లేని వాళ్లు ఇక్కడికొచ్చి కడుపు నిండా తినోచ్చు. ఒకవేళ తమకు ఏదైనా ఇవ్వాలనిపిస్తే మాత్రం అక్కడే ఉండే డ్రాప్‌ బాక్స్‌లో వేయాలి. ఎవరూ బలవంతం చెయ్యరు. సుమారు రూ.11లక్షల తో ఏర్పాటు చేసిన ఈ హోటల్‌ రోజుకు రోజుకు సుమారు 2వేల మందికి ఈ హోటల్‌ భోజనం సమకూరుస్తోంది. ఈ హోటల్‌ కోసం సీఎస్‌ఆర్‌ ఫండ్‌ ఆఫ్‌ కేరళ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌(కేఎస్‌ఎఫ్‌ఈ) ఆధ్వర్యంలో నిధుల సేకరణ చేపట్టగా... డొనేషన్ల రూపంలో ఇప్పటిదాకా రూ. 20 లక్షల సేకరించారు. 

ఈ రెస్టారెంట్‌తోపాటు పక్కనే రెండున్నర ఎకరాల భూమిలో కూరగాయలను సాగు చేస్తున్నారు. రెస్టారెంట్‌ అవసరాలతోపాటు ప్రజలకు అతితక్కువ ధరలకే కూరగాయలను అమ్ముతున్నారు. త్వరలో ఇలాంటి రెస్టారెంట్‌లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు