వణికిస్తున్న కరోనా వైరస్‌.. కేరళ అప్రమత్తం

22 Jan, 2020 20:13 IST|Sakshi

తిరువనంతపురం : పొరుగు దేశం చైనాను అతలాకుతలం చేస్తున్న ప్రమాదకర  కరోనా వైరస్‌ భారత్‌ను భయపెడుతోంది. వైరస్‌ దేశంలోకి చొరబడకుండా కేంద్ర, రాష్ట్ర అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన విమానశ్రయాల్లో స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చైనాతో పాటు కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు చేస్తున్నారు. కొచ్చి ఎయిర్‌పోర్టులో ఇప్పటి వరకు 28 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

అలాగే ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రాణాంతక వైరస్‌ విజృంభించి, మన దేశంలోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కేరళ నుంచి చైనాకు వెళ్తున్న ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మొన్నమొన్నటివరకూ చైనాలోని వూహాన్‌ ప్రాంతానికి మాత్రమే పరిమితమైందనుకున్న సూక్ష్మజీవి కాస్తా ఇప్పుడు ఖండాలు దాటి తైవాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియాలకూ పాకినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో సహా చైనా సరిహద్దు దేశాలూ అప్రమత్తత ప్రకటించాయి.

మరిన్ని వార్తలు