కరోనా: కేరళ ద్వంద్వ ప్రమాణాలు

24 Apr, 2020 21:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: కేరళలోని కాసర్‌గాడ్‌ జిల్లా కరోనా హాట్‌స్పాట్‌గా మారడంతో  గత నెలలో  కేరళతో ఉన్న సరిహద్దులను కర్ణాటక మూసేసింది. రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు దారి తీసిన ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. తాజాగా తమిళనాడుతో ఉన్న సరిహద్దులను కేరళ మూసింది. తమిళనాడులో కోవిడ్‌-19 కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కేరళ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

గత వారం తమిళనాడుకు చెందిన రోగిని తీసుకెళుతున్న అంబులెన్స్‌ను కేరళ పోలీసులు అనుమతించకపోవడంతో అతడు చనిపోయాడు. రోగి ప్రాణాలను కాపాడేందుకు పోలీసులను ఎంత బతిమాలినా జాలిచూపలేదని అంబులెన్స్‌ డ్రైవర్‌ తెలిపాడు. ఈ ఘటన గురించి తిరువనతపురం కలెక్టర్‌ను కె. గోపాలకృష్ణన్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తన దృష్టి​కి రాలేదని సమాధానమిచ్చారు. సాధారంగా అంబులెన్స్‌లు, అత్యవసర సరుకుల వాహనాలను పోలీసులు అడ్డుకోరని చెప్పారు. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అక్కడి నుంచి వచ్చే వాహనాలను అనుమతించడం లేదని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

తమిళనాడులోని కొన్ని దక్షిణాది జిల్లాలు వైద్య అవసరాల కోసం కేరళ మీద ఆధారపడ్డాయని, అర్థాంతరంగా సరిహద్దు మూసివేస్తే ప్రజలు ఏమైపోతారని హక్కుల కార్యకర్త మార్తాండం పి సెల్వరాజ్‌ ప్రశ్నించారు. కర్ణాటక సరిహద్దులు మూసివేయగానే దాన్నో పెద్ద జాతీయ వివాదం చేసిన కేరళ ఇప్పుడు అదే తప్పు చేసిందని విమర్శించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. 
 

చదవండి: కర్ణాటక, కేరళ మధ్య ‘కరోనా చిచ్చు’

మరిన్ని వార్తలు