కేరళలో మళ్లీ నిఫా కలకలం!

3 Jun, 2019 14:43 IST|Sakshi

తిరువనంతపురం : కేరళకు చెందిన ఒక విద్యార్థి నిఫా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరడం కలకలం రేపుతోంది. గతేడాది 17 మంది ప్రాణాలు బలిగొన్న నిఫా వైరస్‌ కేరళ వ్యాప్తంగా డెంజర్‌ బెల్స్‌ మోగించిన సంగతి తెలిసింది. ఈ వైరస్‌ బారిన పడినవారికి చికిత్స అందిస్తున్న ఓ నర్సు కూడా మరణించారు. అయితే తాజాగా ఓ విద్యార్థికి నిఫా వైరస్‌ సోకిందనే వార్తలు భయాందోళనలు రేకెతిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఆ వ్యక్తికి నిఫా వైరస్‌ సోకిందా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉందని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ఇడుక్కి జిల్లాలోని తోడుపుజలోని ఒక కళాశాలలో చదువుకుంటున్న 23 ఏళ్ల ఆ విద్యార్థి ప్రస్తుతం శిక్షణలో భాగంగా త్రిసూర్‌కు వచ్చారు. అయితే అతనికి తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులు గడిచిన జ్వరం తగ్గకపోవడంతో అతన్ని ఎర్నాకులంలోని ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్చారు. అతనికి నిఫా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో అతన్ని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ సీఎం పినరాయి విజయన్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జ్వరంతో బాధపడుతున్న ఆ విద్యార్థి రక్త నమూనాలను నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్టు తెలిపారు. అతనికి నిఫా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో అతడికి నిఫా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయిందని వస్తున్న వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తుది ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉందన్నారు. మరోవైపు రంగంలోకి దిగిన ఎర్నాకులం, త్రిసూర్‌ జిల్లాల వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు