మరో రాష్ట్రానికి షాకిచ్చిన కేంద్రం..

3 Jan, 2020 11:09 IST|Sakshi

కేరళ శకటాన్ని నిరాకరించిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ : కేరళకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. దేశ గణతంత్ర దినోత్సవం వేడకల్లో తమ శకటాన్ని ప్రదర్శించాలనుకున్న కేరళ ఆశలపై కేంద్రం నీళ్లుచల్లింది. శకట ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని కేంద్ర రక్షణశాఖ తిరస్కరించింది. వివిధ కారణాలతో శకటాన్ని అనుమతించడంలేదని శుక్రవారం ఓ ప్రకటక ద్వారా వెల్లడించింది. కాగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేరళ అసెంబ్లీలో చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేర‌ళ‌లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని విజయన్‌ చేశారు. అంతేకాకుండా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి వివాదాస్పద చట్టాలను కేరళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. (శకటాల తిరస్కరణ కుట్ర: సేన, తృణమూల్‌)

కాగా పబ్లిక్‌డే పరేడ్‌లో తమ శకటాలని ప్రదర్శించాలన్న హారాష్ట్ర, బెంగాల్‌, బిహార్‌ ప్రభుత్వాల విజ్ఞప్తిని కేంద్రం ఇదివరకే తిరస్కరించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలు చూపుతూ ఆ రాష్ట్ర శకటాలని నిరాకరించింది. 2020 గణతంత్ర దినోత్సవ కవాతులో మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వాల శకటాలని అనుమతించబోమని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్‌ దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని, అదేమిటో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ సుప్రియా సూలే ఈ విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టారు. కేంద్రం చర్య మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వాలకు అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్‌పై కేంద్రం వివక్షతతో వ్యవహరిస్తోందని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించినందున రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని తృణమూల్‌ ఎంపీ సౌగతా రాయ్‌ అన్నారు. పరేడ్‌లో పాల్గొనే శకటాల జాబితాను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది.

మరిన్ని వార్తలు