లక్షణాలు లేకుండానే కోవిడ్‌-19 దాడి..

7 Apr, 2020 17:43 IST|Sakshi

తిరువనంతపురం : కరోనావైరస్‌కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేని ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌ వచ్చిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. వీరిలో ఒకరు దుబాయ్‌ నుంచి తిరిగివచ్చిన 60 ఏళ్ల వ్యక్తి కాగా, ఢిల్లీకి వెళ్లి వచ్చిన 19 సంవత్సరాల విద్యార్థిని ఉన్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి 100 కిమీ దూరంలోని పథనంతిట్ట జిల్లాలో ఈ రెండు కేసులు నమోదయ్యాయి. వీరికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో వందల మందితో వీరు సన్నిహితంగా గడిపిఉంటారని మహమ్మారి వ్యాప్తికి సంబంధించి ఇది ఓ హెచ్చరిక వంటిదని జిల్లా కలెక్టర్‌ పీబీ నూహ్‌ అన్నారు. కాగా వీరి 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన తర్వాత పాజిటివ్‌గా రావడం, ఎలాంటి లక్షణాలు లేకపోవడం మరింత ఆందోళనకరమని పేర్కొన్నారు.

60 సంవత్సరాల వ్యక్తి మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 6 వరకూ క్వారంటైన్‌లో ఉన్నారని, ఆయన షార్జా నుంచి తిరువనంతపురానికి విమానంలో వచ్చి రోడ్డు మార్గంలో తన స్వస్ధలానికి వెళ్లారని కలెక్టర్‌ తెలిపారు. ఇక​ 19 ఏళ్ల విద్యార్థిని మార్చి 15న ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరి 17న ఎర్నాకుళంలో దిగారని, అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్‌ రావడంతో ఏప్రిల్‌ 4న ఆస్పత్రిలో చేరారని తెలిపారు. హై రిస్క్‌ జోన్‌ల నుంచి వచ్చిన వారితో పాటు విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యాధికారి ఏఎన్‌ షీజా వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4421 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 114 మంది మహమ్మారి బారినపడి మరణించారు. ఇక కేరళలో 327 కోవిడ్‌-19 కేసులు నమోదవగా ఇద్దరు మరణించారు. 58 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

చదవండి : కరోనా నుంచి రేష్మ కోలుకుంది..

మరిన్ని వార్తలు