పుట్టింగళ్ నిందితులకు హైకోర్టు బెయిల్..

11 Jul, 2016 13:34 IST|Sakshi
పుట్టింగళ్ నిందితులకు హైకోర్టు బెయిల్..

తిరువనంతపురంః వందేళ్ళ చరిత్ర కలిగిన పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి సుమారు మూడు నెలలు గడిచిన అనంతరం కేరళ హైకోర్టు 43 మందికి బెయిల్ మంజూరు చేసింది. దేవీ ఉత్సవాల సమయంలో బాణసంచా పేలి జరిగిన ఘోర ప్రమాదంలో అప్పట్లో సుమారు 114 మంది చనిపోగా 383 మంది వరకూ గాయపడ్డవిషయం తెలిసిందే.

పుట్టింగళ్ దేవీ ఆలయ ఆగ్నిప్రమాదంలో నిందితులైన వారందరికీ కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో సుమారు మూడు నెలలు గడిచిన అనంతరం కోర్టు..నిందితులుగా ఉన్న మొత్తం 43 మందికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఆలయ ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా కాలుస్తున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదం అప్పట్లో తీవ్ర విపత్తును సృష్టించింది.

కంబాపురాలో బాణాసంచా భద్రపరిచిన గోడౌన్ అంటుకోవడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు అంటుకున్న నిమిషాల్లోనే కాంప్లెక్స్ మొత్తం వ్యాపించడంతో అక్కడే ఉన్న భక్తులు కొందరు అగ్నికి ఆహుతైపోగా, మరి కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదంలో సంభవించిన పేలుళ్ళతో ఆలయం గోడలు, సమీప కాంక్రీట్ భవనాలు కూలడంతో శిథిలాలకింద పడ్డ భక్తులు సైతం ప్రాణాలు కోల్పోయారు.

అగ్నిప్రమాదం సందర్భంలో పోలీసులు ఆరుగురిపై హత్యాయత్నం, ఇతర నేరాలతోపాటు, ప్రమాదానికి కారణమైన ఆలయ అధికారులు, బాణాసంచా కాంట్రాక్టర్లు పలువురిపై కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు